Jagan

 

అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ

 

🔹దేశ చరిత్రలోనే ఇలా ఆదుకున్న దాఖలా ఎక్కడా లేదు
🔹సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

 

అమరావతి (ప్రశ్న న్యూస్) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం నగదు జమ చేసింది. రెండో విడతలో భాగంగా రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు డిపాజిట్ చేసిన బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ లైన్ ద్వారా నగదు జమ చేశారు.  ఇప్పటివరకు అగ్రిగోల్డ్ బాధితుకు రూ.905 కోట్లకు చెల్లించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. 10 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారికి 207.16 కోట్లు.. 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారి ఖాతాల్లో 459.23 కోట్లు కలిపి మొత్తం 7 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. ఈ మేరకు మొత్తంగా 666.84 కోట్లు విడుదల చేసింది. తొలివిడతలో భాగంగా 10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి ఇప్పటికే 240 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి వచ్చిన సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుందని.. మిగిలిన సొమ్మంతా డిపాజిట్ దారులకు చెల్లిస్తామని జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్ ద్వారా లక్షల మందిని ముంచిన పాపం గత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ స్కామ్ అనేది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వంలోని మనుషుల కోసం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నవారికే ఇందులో హస్తముందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు ఎవరు ప్రయత్నించారో అందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వంలోని వారే ఇందులో కర్త, కర్మ, క్రియ అనేది అందరికీ తెలుసన్నారు.

గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని.. ఎన్నికలకు రెండు నెలల ముందు డబ్బులు చెల్లిస్తామని జీవో ఇచ్చి వంచనకు గురిచేసిందని జగన్ విమర్శించారు. ఒక ప్రైవేట్ సంస్థ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తే.. ప్రభుత్వమే బాధితులకు న్యాయం చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి బాధితులకు డబ్బులు చెల్లిస్తున్నామని జగన్ అన్నారు. గతంలో సీఐడీ ద్వారా వివరాలు సేకరించినా.. తమ ప్రభుత్వం మరోసారి వాలంటీర్లు, సచివాలయాల ద్వారా మరింత మంది వివరాలు సేకరించి వారికి న్యాయం చేస్తోందన్నారు. మిగిలిన బాధితులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్‌ డీజీపీ పీ వీ సునీల్‌ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.