అధికారం మారినప్పుడు పోలీసులే బలి.. ఇదో కొత్త ధోరణి
జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

 

🔹అధికారంలో ఉన్న పార్టీలకు పోలీసులు వత్తాసు.
🔹ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వస్తే వేధింపులు.
🔹కేసు కొట్టేయాలని సుప్రీంలో ఐపీఎస్ అధికారి పిటిషన్.

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) అధికారంలో ఉండే పార్టీతో సత్సంబంధాలు కలిగిన పోలీస్ అధికారులు.. తదనంతర కాలంలో ప్రత్యర్ధి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సస్పెండయిన చత్తీస్‌గఢ్ ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ గుర్జిందర్ పాల్ సింగ్‌‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. తనపై నమోదయిన దేశద్రోహం కేసును కొట్టివేయాలని కోరుతూ గుర్జిందర్ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయన్నారు. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు వారి పక్షం వహిస్తే, ఆ తర్వాత మరో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారిపై కొత్త ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఇది కొత్త రకం ధోరణి అని.. దీనిని ఆపాలని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. గుర్జిందర్ పాల్ సింగ్‌‌ పిటిషన్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన ధర్మాసనం… ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది. సింగ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఫాలీ ఎస్ నారిమన్, ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఐపీఎస్ అధికారి అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ, ఆర్థిక నేరాల విభాగం ఆయనపై ఈ ఏడాది జూన్ 29న కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పోలీసులు.. రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు. సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్యలు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, అధికారులపై కొత్త ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాయి.