అన్న పై షర్మిల తొలి అస్త్రం

 

🔹అన్నను పరోక్షంగా టార్గెట్ చేసిందా..?
🔹ఏపీ ప్రభుత్వం కౌంటర్ చేస్తుందా..
🔹కేసీఆర్ ట్రాప్ లో చిక్కుకున్నారా..?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఊహించిందే జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నా…స్పందించక తప్పలేదు. అందునా తెలంగాణకు మద్దతుగా కీలకవ్యాఖ్యలు చేసారు. అందులో తన అన్న పేరు ప్రస్తావించకపోయినా..పరోక్షంగా తన అన్న..ఏపీ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని హెచ్చరిక చేసారు. రాజకీయంగా తన చిత్తశుద్దిని చాటుకొనే క్రమంలో తొలి అస్త్రాన్ని సంధించారు. కొద్ది రోజులుగా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తి పోతల పధకం పైన తెలంగాణ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్సార్ పేరు ప్రస్తావించి..సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి పైనా విరుచుకు పడుతున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నామని..వారు ఏం మాట్లాడినా అది వారికే వదిలేస్తున్నామని చెప్పుకొచ్చింది. అయితే, తెలంగాణ మంత్రుల తరహాలో కాకున్నా..ఏపీ ప్రభుత్వం పైన భవిష్యత్ లో షర్మిల సైతం తెలంగాణ పార్టీ నేతగా స్పందించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చింది. దీంతో..ముందుగానే తెలంగాణ నేతలు ఏం మాట్లాడినా తాము స్పందించబోమని స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు షర్మిల కొద్ది రోజుల క్రితం ఖమ్మం సభలో చెప్పిన విధంగానే…ఒక ట్వీట్ చేసారు. అందులో తెలంగాణకు సంబంధించి ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం…అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడటానికి సిద్దం..అంటూ షర్మిల ట్వీట్ లో స్పష్టం చేసారు. అందులో షర్మిల ఉద్దేశం ఏంటనేది తెలుస్తూనే ఉంది.

పార్టీ ప్రకటన చేసిన సమయంలోనూ తెలంగాణ నీటి సమస్యలు..ప్రయోజనాల విషయంలో అవసరమైతే అన్నతో అయిన పోరాడతానంటూ షర్మిల చెప్పుకొచ్చారు. ఏపీ ప్రయోజనాల కోసం అన్న ప్రభుత్వం పని చేస్తుందని…తెలంగాణ కోసం తాను నిలబడతానని చెప్పారు. అదే సమయంలో అన్న జగన్ తో షర్మిల విభేదించారని…అన్నతో కంటిన్యూ కాలేకనే పార్టీ పెట్టారంటూ జగన్ రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపించారు. షర్మిల తన దీక్ష సమయంలోనూ… తన దీక్ష సాక్షిలో కవర్ చేయరుగా అంటూ…నోరు జారారు. వెంటనే పక్కనే ఉన్న విజయమ్మ తన కుమార్తెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసారు. అదే విధంగా తనకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్ నే అడగాలంటూ..షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా వారిద్దరి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారానికి కారణమయ్యాయి. కానీ, జగన్ సన్నిహితుడు మాత్రం వారద్దరి మధ్య విభేదాలు లేవని..ఉన్నవి బేధాభిప్రాయేలనంటూ వివరణ ఇచ్చారు. ఇక, షర్మిల పార్టీకీ వైఎస్సార్ పేరు వినియోగించే విషయంలోనూ విజయమ్మ నుండి నిరభ్యంతర సర్టిఫికెట్ షర్మిలకు అందింది. అయితే, ఇప్పుడు షర్మిల రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా తన వైఖరి వెల్లడించే క్రమంలో ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు పైన స్పందించాల్సి ఉంటుంది. అవసరమైతే టీఆర్ఎస్ కంటే ఒకింత ఎక్కువగానే మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు ఏపీ మంత్రులకు కౌంటర్ చేయటానికి సమస్యలు తప్పవు.

అయితే, జగన్ ఏపీ ప్రయోజనాల కోసం ఎవరు విమర్శలు చేసినా తిప్పి కొట్టమని సూచిస్తారా..లేక, సంయమనంతో ఉండమని చెబుతారా అనేది కీలకం. అయితే, రాజకీయ వ్యూహాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి అమలు చేసిన ప్లాన్ సక్సెస్ అయినట్లేననే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక, వైఎస్సార్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన షర్మిల..తన అన్న పైన చేస్తున్న వ్యాఖ్యలపైన స్పందించలేదు. దీంతో..ఇప్పుడు షర్మిల చేసిన ట్వీట్ తో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.