Ashwagandha

 

‘అశ్వగంధ’ కోవిడ్‌ను నయం చేయగలదా

 

*యూకెతో భారత్‌ క్లినికల్ ట్రయల్స్
*సక్సెస్ అయితే మరో ముందడుగు పడినట్లే

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఆయుర్వేద వనమూలిక అశ్వగంధలో కోవిడ్‌ను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయా… ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ యూకెకి చెందిన లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ తో కలిసి పరిశోధనలు జరపనుంది. ఇందుకోసం యూకెలోని మూడు నగరాల్లో దాదాపు 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ,ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అశ్వగంధ మొక్కను సాధారణంగా ఇండియన్ వింటర్ చెర్రీ అని పిలుస్తారు.సంప్రదాయ మూలిక వైద్యంలో,ఆయుర్వేదంలో ఇది దివ్యమైన ఔషధంగా చెబుతారు. ఒత్తిడిని తగ్గించి శరీరంలో రోగ నిరోధకతను పెంపొందించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కోవిడ్ చికిత్సలో అశ్వగంధ సానుకూల ప్రభావం చూపించగలదని గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశోధన కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్-యూకె సిద్ధమవుతున్నాయి. తద్వారా కోవిడ్ చికిత్సలో అశ్వగంధ ప్రభావాన్ని నిర్దారించనున్నాయి.

ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ప్రాజెక్టులో కోఇన్వేస్టిగేటర్‌గా ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ తనుజా మనోజ్ మాట్లాడుతూ… క్లినికల్ ట్రయల్స్‌ కోసం ఔత్సాహికులైన 2000 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వీరిని 1000 చొప్పున రెండు గ్రూపులుగా విభిజించనున్నట్లు చెప్పారు. ఇందులో ఒక గ్రూపుకు 3 నెలల పాటు అశ్వగంధ మాత్రలు,మరో గ్రూపుకు ప్లాసిబో ఇస్తారు. ఈ ప్లాసిబో రుచిలోనూ,రూపంలోనూ అచ్చు అశ్వగంధ లాగే ఉంటుంది. కాబట్టి తేడాను గుర్తుపట్టడం సాధ్యం కాదు. వైద్యులు,పేషెంట్లు ఇరువురికీ అశ్వగంధ,ప్లాసిబోల్లో.. ఏది ఇస్తున్నారో తెలియదు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఒక గ్రూపుకు రోజుకు రెండు చొప్పున 3 నెలల పాటు 500ఎంజీ అశ్వగంధ ట్యాబెట్లను ఇస్తారు. ఆ పీరియడ్‌లో వారి యాక్టివిటీస్,మానసిక,శారీరక స్థితి,సప్లిమెంట్ ఉపయోగం,ప్రతికూలతలు తదితర అంశాలను పరిశోధిస్తారు. ఈ పరిశోధన మొత్తం పూర్తవడానికి దాదాపు 16 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌ సక్సెస్ అయితే ఇన్ఫెక్షన్లను నిర్మూలించడంలో అశ్వగంధ సమర్థవంతంగా పనిచేయగలదని నిరూపించినట్లవుతుంది. సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి గుర్తింపు లభిస్తుంది.గతంలో అశ్వగంధపై జరిపిన పలు పరిశోధనలు ఈ ఔషధానికి వైరస్‌తో పోరాడే శక్తి ఉందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అశ్వగంధ క్లినికల్ ట్రయల్స్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ అశ్వగంధకు గనుక కోవిడ్‌ను నిర్మూలించే శక్తి ఉంటే… ఇది ఎక్కడైనా విరివిగా దొరికే ఔషధం కాబట్టి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో మెడిసిన్ ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా కోవిడ్‌ను ఎదుర్కోవడం మరింత సులువవుతుంది.