Talibans

 

అసలెవరీ తాలిబాన్లు..?

 

జె.సతీష్ – పరిశోధన పాత్రికేయులు (ప్రశ్న న్యూస్) అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనలు 2001లో తాలిబాన్లను అధికారం నుంచి తొలగించిన తరువాత వారు నెమ్మదిగా శక్తిని పుంజుకుంటూ అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. రెండు దశాబ్దాల పాటు సాగిన యుద్ధం తర్వాత ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి అఫ్గాన్ భూభాగం నుంచి అమెరికా తన సేనలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. మరో వైపు, తాలిబాన్లు మాత్రం అఫ్గాన్ మిలటరీ అవుట్ పోస్టులు, గ్రామాలు, పట్టణాలు, ప్రధాన నగరాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. దీంతో, వారు మరో సారి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయాలు అఫ్గాన్‌లో కనిపిస్తున్నాయి. 2018లో తాలిబాన్లు నేరుగా అమెరికాతో చర్చలు జరపడం మొదలుపెట్టారు. చివరకు దోహాలో ఫిబ్రవరి 2020లో రెండు వర్గాలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాన్ని అనుసరించి అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తమ సేనలను ఉపసంహరించుకునేందుకు, తాలిబాన్లు అమెరికా సేనలపై దాడులు జరపకుండా ఉండేందుకు అంగీకారం కుదిరింది. తాలిబాన్ల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూప్ అల్ ఖైదా లేదా ఇతర మిలిటెంట్ గ్రూపులను తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించకూడదన్నది కూడా ఈ ఒప్పందంలో ఉంది. వీటితో పాటు జాతీయ శాంతి చర్చలు నిర్వహించేందుకు ముందుకు కదలాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, ఈ ఒప్పందం చేసుకున్న మరుసటి సంవత్సరమే, తాలిబన్లు అఫ్గాన్ భద్రతా దళాలను, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతం అమెరికా ఆ దేశం నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో తాలిబాన్లు దేశవ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు.
Talibans
🔹అధికార పీఠం పైకి..

తాలిబాన్ అంటే పష్తో భాషలో విద్యార్థులు అని అర్థం. అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ దళాల ఉపసంహరణ తరువాత 1990ల తొలినాళ్లలో ఉత్తర పాకిస్తాన్‌లో తాలిబన్ ఉద్యమం మొదలైంది. పాకిస్తాన్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో పఖ్తూన్ హక్కుల కోసం మొదలైన ఈ ఉద్యమం మొదట్లో మత సంస్థలలోనే కనిపించేది. సున్నీ అతివాద ఇస్లాం బోధలు చేసే ఈ మత సంస్థలకు నిధులు చాలా వరకు సౌదీ అరేబియా నుంచి అందేవి. తమకు కనుక అధికారం వస్తే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఉండే పఖ్తూన్ ప్రాంతంలో ‘కఠినమైన షరియా లేదా ఇస్లాం చట్టాన్ని అమలు చేసి శాంతిభద్రతలు నెలకొల్పుతామని తాలిబన్లు అక్కడి వారికి హామీ ఇచ్చారు. నైరుతి అఫ్గానిస్తాన్‌ నుంచి తాలిబాన్లు తమ ప్రాబల్యం వేగంగా పెంచుకున్నారు. సెప్టెంబరు 1995లో ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న హెరాత్ ను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఒక్క సంవత్సరం తర్వాత అఫ్గాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్షుడు బుర్హనుద్దీన్ రబ్బానీను పదవి నుంచి తప్పించారు. రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోవియెట్ ఆక్రమణలను అడ్డుకున్న అఫ్గాన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో రబ్బానీ ఒకరు. 1998ల నాటికి తాలిబాన్లు 90 శాతం ఆఫ్గనిస్తాన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి సోవియెట్ సేనలు వైదొలిగిన తర్వాత ముజాహిదీన్ సభ్యుల మధ్య ఉన్న అంతర్యుద్ధంతో అఫ్గాన్లు అలసిపోయారు. దాంతో, వారు తాలిబాన్ల రాకను ఆహ్వానించారు. తొలినాళ్లలో, దేశంలో అవినీతిని అణచివేయడంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో, వాళ్ళ అధీనంలో ఉన్న రోడ్లు, ప్రాంతాలను వ్యాపారాభివృద్ధికి అనువుగా చేయడంతో తాలిబన్లు బాగా పాపులారిటీ సంపాదించారు. కానీ, వీటితో పాటు తాలిబన్లు శిక్ష పడిన హంతకులను, మోసం చేసినవారిని బహిరంగంగా ఉరి తీయడం, దొంగతనం చేసిన వారికి కాళ్లు చేతులు విరిచి అంగవికలులను చేయడం లాంటి ఇస్లామిక్ శిక్షలను కూడా ప్రవేశపెట్టారు. పురుషులందరూ కచ్చితంగా గెడ్డం పెంచుకోవాలని, మహిళలు బురఖా ధరించాలనే నియమాలను కూడా విధించారు. టెలివిజన్, సినిమాలు చూడటాన్ని, సంగీతం వినడాన్ని నిషేధించారు. 10 ఏళ్లు నిండిన అమ్మాయిలను బడికి పంపడాన్ని కూడా ఆమోదించలేదు.

వారు మానవ హక్కులను కాలరాసి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వచ్చాయి. 2001లో తాలిబాన్లు మధ్య అఫ్గానిస్తాన్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బమియాన్ బుద్ధుని విగ్రహాలను కూడా నాశనం చేయడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. దీని పట్ల అంతర్జాతీయంగా ఆగ్రహం వెల్లువెత్తింది. అయితే, తాలిబన్లకు రూపకర్త పాకిస్తాన్ అనే వాదనను మాత్రం పాకిస్తాన్ ఖండిస్తూ వచ్చింది. కానీ, తాలిబన్ల ఉద్యమంలో ముందు చేరిన అఫ్గాన్ మద్దతుదారులు పాకిస్తాన్‌లోని మదరసాలలో విద్యాభ్యాసం చేసి వచ్చారనే అనుమానం కూడా ఉంది. తాలిబాన్లు ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత వారిని గుర్తించిన దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. అలాగే, తాలిబాన్లతో దౌత్య సంబంధాలు తెంచుకున్న దేశాల్లో పాకిస్తాన్ ఆఖరి దేశం కూడా. ఒక సమయంలో అయితే, పాకిస్తాన్ వాయువ్య భాగంలో తాలిబన్ల నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌ను అస్థిర పరుస్తామని కూడా బెదిరించారు. అక్టోబరు 2012లో మింగోరా పట్టణంలో స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న మలాలా యూసఫ్‌జాయిపై తాలిబాన్లు జరిపిన కాల్పులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. రెండేళ్ల తర్వాత పాకిస్తాన్‌లోని పెషావర్‌లో స్కూలు పిల్లలపై జరిగిన దాడి పాకిస్తాన్‌లో తాలిబాన్ల ప్రాధాన్యాన్ని బాగా తగ్గించింది. పాకిస్తాన్ తాలిబాన్‌కు చెందిన కనీసం ముగ్గురు ప్రముఖ వ్యక్తులు 2013లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మరణించారు. అందులో తాలిబాన్ల నాయకుడు హకీముల్లా మెహసూద్ కూడా ఉన్నారు.

Talibans
🔹అల్ ఖైదా స్థావరం

సెప్టెంబరు 2001లో న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడుల తర్వాత అఫ్గానిస్తాన్‌లో ఉన్న తాలిబన్ల పైకి ప్రపంచం దృష్టి మళ్లింది. ఈ దాడుల్లో ముఖ్య నిందితులైన ఒసామా బిన్ లాడెన్‌కు, ఆయన చేపట్టిన అల్ ఖైదా ఉద్యమానికి తాలిబాన్లే ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. 2001, అక్టోబరు 7న అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ పై దాడులు నిర్వహించాయి. డిసెంబరు తొలి వారానికల్లా తాలిబన్ల అధికారం కూలిపోయింది. అప్పటి తాలిబాన్ల నాయకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్, ఇతర సీనియర్ నాయకులు, బిన్ లాడెన్‌ సహా సేనలకు పట్టుబడకుండా తప్పించుకున్నారు. పాకిస్తాన్‌లోని క్వెట్టాలో చాలా మంది సీనియర్ తాలిబన్ నాయకులు తల దాచుకున్నట్లు చెబుతారు. కానీ, ఇస్లామాబాద్ మాత్రం ఆ వాదనను ఖండించింది. అధిక సంఖ్యలో విదేశీ సేనలు ఉన్నప్పటికీ కూడా, తాలిబాన్ నెమ్మదిగా తమ శక్తిని పుంజుకుని, అఫ్గానిస్తాన్‌లో తమ ప్రాబల్యం పెంచుకుంది. దాంతో, దేశంలో చాలా ప్రాంతాల్లో అభద్రత నెలకొనడంతో పాటు, దేశంలోతిరిగి 2001 నాటి పరిస్థితులు, హింస చోటు చేసుకోవడం మొదలయింది. కాబూల్ పై తాలిబాన్లు చాలాసార్లు దాడులు చేశారు. సెప్టెంబరు 2012లో నాటో శిబిరం పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. 2013లో తాలిబాన్లు ఖతార్‌లో తమ ఆఫీసును తెరవడానికి ప్రణాళికలను ప్రకటించగానే, శాంతి చర్చలు జరుగుతాయనే ఆశలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఒక అపనమ్మకం అయితే మాత్రం అన్ని వైపులా తీవ్ర స్థాయిలోనే మిగిలిపోయింది. హింస కూడా కొనసాగింది. పాకిస్తాన్‌లోని ఒక హాస్పిటల్‌లో ఆరోగ్య సమస్యలతో ముల్లా ఒమర్ మరణించడాన్ని రెండు సంవత్సరాల పాటు దాచిపెట్టినట్లు ఆగస్టు 2015లో తాలిబాన్లు అంగీకరించారు. ఆ తర్వాత నెలలోనే, కొన్ని వారాల పాటు జరిగిన అంతర్యుద్ధాన్ని పక్కన పెట్టి, ముల్లా ఒమర్ డిప్యూటీగా పని చేసిన ముల్లా మన్సూర్‌కు తమ నాయకునిగా మద్దతు తెలుపుతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అదే సమయంలో, తాలిబాన్లు 2001లో ఓడిన తర్వాత మొదటిసారి అఫ్గాన్ రాజధానిని స్వాధీనం చేసుకున్నారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన కుందుజ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మే 2016లో అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ముల్లా మన్సూర్ మరణించారు. ఆయన స్థానాన్ని మౌలావి హీబాతుల్లా అఖుండ్ జాదా చేపట్టారు. ఇప్పటికీ ఈ బృందం ఆయన ఆధీనంలోనే ఉంది.

Talibans
🔹సేనల ఉపసంహరణకు కౌంట్ డౌన్

అమెరికా, తాలిబాన్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఫిబ్రవరి 2020లోతాలిబాన్ల వైఖరిలో మార్పులు చేసుకున్నట్లుగా కనిపించారు. ప్రముఖులను హతమార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుని తాలిబాన్లు నగరాల పై, మిలటరీ అవుట్ పోస్టులపై దాడులు చేసే విధానాలను మార్చుకుంటున్నట్లుగా కనిపించారు. తాలిబాన్లు చేసిన దాడులు అఫ్గాన్ పౌరుల్లో భయాన్ని రేకెత్తించాయి. తాలిబాన్లు తమ అతివాద సిద్ధాంతాలను ఏ మాత్రం మార్చుకోలేదని, కేవలం వాళ్ళ వ్యూహాలను మాత్రమే మార్చారని తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్న విలేఖరులు, న్యాయమూర్తులు, శాంతి ప్రచారకులు, అధికారంలో ఉన్న మహిళలు అంటున్నారు. అంతర్జాతీయ సహకారం లేకపోతే అఫ్గాన్ ప్రభుత్వం తాలిబాన్లకు లొంగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమోననే ఆందోళనను అధికారులు వ్యక్తం చేసినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్ 2021లో అమెరికా సేనలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉపసంహరణ ప్రక్రియను సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అయితే, ఇప్పటికే ఉపసంహరణ దాదాపు పూర్తయింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘటన జరిగి ఆ రోజుకు సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ రెండు దశాబ్దాల్లో తాలిబాన్ అఫ్గానిస్తాన్‌‌లో విస్తృతమైన భూభాగాన్ని ఆక్రమించింది. అమెరికా సేనలు వైదొలుగుతున్న నేపథ్యంలో కాబూల్‌లో ప్రభుత్వాన్ని కూలదోస్తామనే బెదిరింపులు కూడా చేసింది. 2001లో తాలిబాన్లను అధికారం నుంచి తప్పించినప్పటి కంటే కూడా ఇప్పుడు వారు 85,000 మంది ఫుల్‌టైం ఫైటర్‌లతో బాగా శక్తివంతంగా ఉన్నట్లు నాటో అంచనా వేస్తోంది. అఫ్గానిస్తాన్‌లో జిల్లాలు కొన్నాళ్ళు పాటు తాలిబన్ల అధీనంలో, కొన్ని రోజులు ప్రభుత్వ అధీనంలో ఉండటం వల్ల తాలిబాన్ల అధీనంలో ఉన్న భూభాగాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. కానీ, దేశంలో అయిదు నుంచి మూడో వంతు వరకు భూభాగం వారి అధీనంలో ఉంటుందని ఇటీవల చేసిన కొన్ని అంచనాలు చెబుతున్నాయి. తాలిబాన్ల ప్రాముఖ్యం పెరగడం చాలా మంది భయపడినదాని కంటే కూడా వేగంగా జరిగింది. దేశం మళ్ళీ హింసాత్మకంగా అంతర్యుద్ధం వైపు ప్రయాణించే అవకాశం ఉందని అఫ్గానిస్తాన్‌లో యూఎస్ మిషన్ కమాండర్ జనరల్ ఆస్టిన్ మిల్లర్ జూన్‌లో హెచ్చరించారు. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. అదే నెలలో, అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన ఆరు నెలలలోపే అఫ్గాన్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని ఒక యూఎస్ ఇంటెలిజెన్స్ అంచనా పేర్కొంది.