ఆగిన చోట నుండే మళ్ళీ పాదయాత్ర
ఈటల కోసం అభిమానుల పూజలు
ఈటలను పరామర్శించిన బండి సంజయ్
మళ్ళీ ప్రజా దీవెన యాత్ర ప్రారంభిస్తానని చెప్పిన ఈటల
వేయాల్సిన అడుగులు చేరాల్సిన ఊళ్ళు చాలా ఉన్నాయన్న ఈటల
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మళ్లీ ప్రజల ఆదరాభిమానాల కోసం ప్రజా దీవెన యాత్ర మొదలుపెట్టిన ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. 12 రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ కు తీవ్రంగా జ్వరం రావడంతో పాటుగా, స్వల్పంగా జలుబు, దగ్గు కూడా కనిపించాయి. ఆయన పాదాలకు సైతం బొబ్బలు వచ్చాయి. పాదయాత్ర 12 వ రోజున వీణవంక మండలం లోని కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటెల రాజేందర్ పాదయాత్రలో అస్వస్థతకు గురవడంతో స్థానిక వైద్యులు పరీక్షించి ఆయనను వెంటనే హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలని బిజెపి కార్యకర్తలు, ఆయన అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండల వ్యాప్తంగా ఆయన పేరుమీద అర్చనలు, పూజలు చేశారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్రలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు . ఇదిలా ఉంటే హైదరాబాద్ నిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు మూడు రోజులు రెస్ట్ అవసరమని చెప్పారని బండి సంజయ్ మీడియాకు వెల్లడించారు. దయచేసి ఈటల పరామర్శించడానికి ఎవరు హాస్పిటల్ కు రావద్దని, ఆయనకు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే ఈటల రాజేందర్ పాదయాత్రను కొనసాగిస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు. అప్పటివరకు కార్యకర్తలందరూ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్రపై మాట్లాడారు. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్లీ పునః ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. ఆగిన చోట నుండి అడుగులు మొదలవుతాయని కొండంత ప్రజల దీవెనలతో త్వరలోనే ప్రజా దీవెన యాత్రలో పాల్గొంటానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం అంటూ ఈటల రాజేందర్ తనను ఆదరించిన ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. వేయాల్సిన అడుగులు చేరాల్సిన ఊళ్ళు చాలా ఉన్నాయని, కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుట పడగానే మళ్లీ ప్రజా దీవెన యాత్ర ప్రారంభిస్తానని స్పష్టంచేశారు ఈటల రాజేందర్.హుజూరాబాద్ నియోజకవర్గంపై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్న వేళ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈటల సైతం ఈ ఎన్నికను ఆత్మగౌరవ ప్రతీకగా భావిస్తూ ప్రచారం చేస్తున్నారు.