Anam Chinny

 

ఆదివాసుల హక్కులకై ‘జల్- జంగల్- జమిన్’

 

◆ గర్జించిన మూగబోయిన గొంతుకలు
◆ తెలంగాణ భూపరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఆదివాసుల హక్కులకై నాడు నిజాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ‘జల్- జంగల్- జమిన్’ అంటూ పోరాడిన కొమరం భీం బాటలోనే మళ్ళీ అదే నినాదంతో
తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ భూపరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. హైదరాబాద్, సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గాదె ఇన్నయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ మల్లు రవి, సుప్రీంకోర్టు న్యాయవాది నీరప్ రెడ్డి,  హైకోర్టు న్యాయవాది బి.రవి కుమార్, డాక్టర్ విశాల్, టీచర్ నాని రావు, సెలతా అశోక్, కె.రవిచందర్, జంగా భీమ, మురహరి, సీనియర్ పాత్రికేయులు గోపిరెడ్డి సంపత్ తదితరులు పాల్గొనగా.. పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు చివరిగా మాట్లాడి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…

తమ హక్కుల కోసం, మరొక ఉద్యమం తీవ్ర రూపం దాల్చే పరిస్థితి నెలకొందని, మూడు తరాల నుండి ఆ అడవులనే నమ్ముకొని తమ బ్రతుకులను గడుపుతున్న అమాయకపు గిరిజన తండాలలో ఇప్పుడు ఉద్యమ వాతావరణాలకు తెలంగాణ సర్కార్ ఆజ్యం పోస్తుందని అన్నారు. తాము సాగు చేస్తున్న పోడు భూములపై తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎన్నోసార్లు ఆదివాసీల ఉద్యమాలు చేశారని, ఆ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కి కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా అర్హులైన ఆదివాసీలకు పట్టా పత్రాలను ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ భూములను బలవంతంగా లాక్కొంటుందన్నారు.

అడవులనే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న బ్రతుకులు ఆదివాసీ  గిరిజనులవి, అడవుల్లో భూములను సాగు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న వారి బ్రతుకులు ఇప్పుడు అంధకారంలో పడ్డాయని అన్నారు. అడవులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమం ఓ పెద్ద కుంభకోణమని అన్నారు.

మొన్న కాన్కూర్, నిన్న సార్సాలా ప్రాంతాల పేర్లు ఏవైనా అక్కడి అడవుల్లో గిరిజనులకు, అటవీ అధికారులకు  జరుగుతున్న గొడవలతో పచ్చని అడవులు ఎరుపుగా వనాలుగా మారుతున్నయని, అడవులనే నమ్ముకొని పోడు భూములను సాగు చేస్తూ ప్రశాంతంగా బ్రతికిన ఆ గిరిజన గుడాలు ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తున్నాయని, సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో స్టే విధించి.. ఆదివాసుల హక్కులకు భంగం కలిగించ వద్దని చెప్పినా.. ప్రభుత్వం, పోలీసులు పెడచెవిన పెడుతున్నారని వారన్నారు.

వాస్తవానికి వస్తే 2005, డిసెంబర్ 13 ముందు ఎవరైతే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి ఉందో ఆర్వోఎఫ్ఆర్ 2006 ప్రకారం అటవీ హక్కుల చట్టం కింద పట్టాలను ఇవ్వడానికి  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టాల కోసం 61353 దరఖాస్తులను స్వీకరించారని, వాటిలో 20,716 అర్జీలను తిరస్కరించారని అయితే వారి కోసం 5,20,880 ఎకరాల భూమిలో కొందరికి పట్టాలను ఇచ్చారని.. ఇది దోపిడీకి నిదర్శనమన్నారు.