KCR

 

ఆ ముగ్గురి విషయంలో కేసీఆర్ లెక్కేంటి.?

 

హుజూరాబాద్‌లో ప్రభావం చూపించే నాయకులుగా గుర్తింపు ఉన్న ఎల్.రమణ, కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. పెద్దిరెడ్డి కూడా పార్టీలోకి రాబోతున్నారు.

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో ఇప్పుడు రాజకీయవర్గాలన్నీ హుజూరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ శ్రేణులన్నీ హుజూరాబాద్‌లో పార్టీ గెలవడం ఎలా అనే అంశంపైనే ఫోకస్ చేశాయి. స్వయంగా సీఎం కేసీఆర్ స్వయంగా హుజూరాబాద్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టడంతో.. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా.. గెలుపు తమదే కావాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నేతలు పని చేస్తున్నారు. ఇందుకోసం అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్ కేంద్రంగా వలసలను ప్రొత్సహిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు వ్యూహంలో భాగంగానే టీటీడీపీ అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుంది. ఈ నెల 30న మాజీమంత్రి పెద్దిరెడ్డి సైతం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరడం ఖాయం కావడంతో హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ వీరిలో ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్‌లో దళితబంధు వంటి పథకం సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది టీఆర్ఎస్. ఇంత చేస్తున్నా.. అక్కడ తమ పార్టీ తరపున పోటీ చేయబోయేది ఎవరనే విషయంలో మాత్రం గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు ఇక్కడ ఈటలకు పోటీగా కేసీఆర్ ఎవరిని బరిలో నిలుపుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్‌లో ప్రభావం చూపించే నాయకులుగా గుర్తింపు ఉన్న ఎల్.రమణ, కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. పెద్దిరెడ్డి కూడా పార్టీలోకి రాబోతున్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని కేసీఆర్ ఈటలపై పోటీకి దింపబోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇంకా చాలా నెలల సమయం ఉండటంతో.. అప్పటివరకు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పలేమని కొందరు చర్చించుకుంటున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని.. కాబట్టి ఎల్.రమణ, కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డిల్లో ఒకరు కచ్చితంగా టీఆర్ఎస్ తరపున పోటీలో ఉంటారని ఊహించలేమని పలువురు భావిస్తున్నారు.