ఇంటి దొంగలకు రేవంత్ డెడ్ లైన్
🔹వెళ్లకుంటే వదిలేదే లేదు..
🔹టీపీసీసీ చీఫ్ సంచలనం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి పార్టీని క్రమశిక్షణలో పెట్టడం కోసం తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. తాజాగా హుజూరాబాద్ టికెట్ విషయంలో కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారంలో అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తాం అంటూ కఠిన నిర్ణయం వెల్లడించిన రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిర్మల్ లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యవహారంతో పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లిపోవచ్చు అంటూ డెడ్ లైన్ విధించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటి దొంగలను వదలబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలను కడుపులో దాచుకుంటుందని తేల్చి చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టే వారిపై డైరీ రాస్తున్నామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించిన అధికారుల మోకాళ్ళ చిప్పలు పగలగొట్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చట్ట పరిధిలో పని చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు . ఉద్యమాలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ లక్కీ నెంబర్ 6, నా లక్కీ నెంబర్ 9 , 6 నంబర్ ను తిరగేస్తే 9 అవుతుంది. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుండి మహేశ్వర్ రెడ్డి ని గెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిగా రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసే వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసేవారు బయటకు వెళ్తే మంచిదని తేల్చి చెప్పారు. వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి దూకుడు పార్టీని సరైన మార్గంలో పెడుతుందా.? లేకా పార్టీలో రేవంత్ పై వ్యతిరేఖత పెంచుతుందా అనేది తెలియాల్సి ఉంది.