ఈటలతో మాకు పోటీ లేదు
🔹5 ఏళ్లు భరించింది కేసీఆరే
🔹హుజురాబాద్ పై తొలిసారిగా స్పందించిన కేటీఆర్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికను అనివార్యం చేయడంతోపాటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పునకూ కారణమైన ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కార్యదర్శులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలను తిట్టిపోసిన కేటీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక, మాజీ మంత్రి ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈటల రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన. లేనిపోని మాటలతో ఆయన తనను తానేకాదు, ప్రజలను కూడా మోసపుచ్చుతున్నారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంత గౌరవిమిచ్చిందో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయమేంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టారు. తన తప్పులను ఆయనే ఒప్పుకున్నారు. భూకబ్జాలపై ఎవరో అనామకుడు లేఖ రాస్తే సీఎం చర్యలకు దిగారన్నది అవాస్తవం. ఐదేళ్ల కిందటే ఆత్మగౌరవం దెబ్బతింటే మంత్రిగా ఎందుకు కొనసాగినట్లు, నిజానికి అడ్డగోలుగా మాట్లాడినా ఐదేళ్లూ ఈటెలను బరించింది సీఎం కేసీఆరే” అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈటల రాజేందర్ పార్టీలో చేరేనాటికే టీఆర్ఎస్ బలంగా ఉండిందని, 2003లో అతికష్టంమీద ఆయనకు టికెట్ ఇచ్చామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపై మాట్లాడుతూ, అక్కడ టీఆర్ఎస్ విజయం తథ్యమన్న మంత్రి.. తమ పోటీ ఈటల రాజేందర్ తోనో, మరో వ్యక్తితోనో కాదని, ఎన్నిక ఏదైనప్పటికీ పోటీ పార్టీల మధ్యే ఉంటుంది తప్ప, వ్యక్తిగతం కాబోదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఈటలతో వ్యక్తిగతమైన పోటీ లేదు, కాంగ్రెస్, బీజేపీలతోనే తలపడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఇక, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనన్న కేటీఆర్.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా ముందుకెళుతున్నదని చెప్పారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు అర్థమే లేదని మండిపడ్డారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్కపైసా తీసుకురాని బండి సంజయ్ ఇక్కడ ఎందుకు పాద యాత్ర చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ గా తెలంగాణ బీజేపీ తయారైందన్నారు. కాగా, టీఆర్ఎస్ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం కేటీఆర్ చర్చించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా, పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపైనా భేటీలో చర్చించారు.