ఈటల గెలిస్తే వచ్చే లాభం ఏంటీ..?
బీజేపీ గెలిస్తే ఈటలకే లాభం..
హుజూరాబాద్ అభివృద్ధి కాదు..
ఈటలపై హరీష్ రావు విమర్శలు
దళితబంధు హుజూరాబాద్‌లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారని విమర్శించారు హరీష్ రావు. కల్యాణ లక్ష్మి, రైతుబంధు అవసరం లేదని అన్నారని, దీనిపై బీజేపీ వైఖరేంటో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ రాజకీయాలు తెలంగాణలో సెగలు రేపుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈటల రాజేందర్ కూడా గేర్ మార్చి దూసుకెళ్తున్నారు. గులాబీ పార్టీ విమర్శల దాడిని తీవ్ర తరం చేశారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఐతే ఆయన వ్యాఖ్యలపై అంతే స్థాయిలో ఎదురు దాడికి దిగారు హరీష్ రావు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలిస్తే లాభం ఏమీ ఉండదని.. ఈటల విజయం సాధిస్తే ఆయనకు మాత్రమే లాభమని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయాపడ్డారు. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా? అన్న చర్చ జరగాలని హరీష్ రావు తెలిపారు. దళితబంధు హుజూరాబాద్‌లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారని విమర్శించారు హరీష్ రావు. కల్యాణ లక్ష్మి, రైతుబంధు అవసరం లేదని అన్నారని, దీనిపై బీజేపీ వైఖరేంటో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుబంధును హుజూరాబాద్‌లో ప్రారంభిస్తే ఈటల చప్పట్లు కొట్టారని, ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో దళితబంధు ప్రారంభిస్తామని ప్రకటిస్తే మాత్రం గుండెలు బాదుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకాన్ని నిలిపివేసేందుకు.. ఎన్నికలను త్వరగా నిర్వహించాలని కేంద్రం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతుబంధు, దళితబంధు దండగ అనే బీజేపీ నేతల ఈటల కావాలా? టీఆర్‌ఎస్ కావాలా? అన్న చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. దళితబంధును ఎన్నికల కోసం పెట్టలేదని.. గత మార్చి నెలలో బడ్జెట్ లోనే రూ.1200 కోట్లతో దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్‌ను ఆర్థికమంత్రిగా తాను అసెంబ్లీలో ప్రకటించానని గుర్తు చేశారు హరీష్ రావు. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుని, ఆ గడియారాలను పగులగొడుతున్నారని అన్నారు..ఇక తెరాస గెలుపు పక్కా..అని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.. ఇక 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. తెరాస రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబరు వన్ గా నిలిపింది. మరో వైపు మన దేశ జీడీపీ బంగ్లాదేశ్ కన్నా తక్కువగా పడిపోయోలా బీజేపీ పాలన సాగిందని ఆయన విమర్శించారు . హుజూరాబాద్ లో బీజేపీ వాళ్లు ఎం చెప్పి ఓట్లు అడుగుతారో చెప్పాలని అన్నారు…ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా..అంటూ ఆయన విమర్శించారు.