Eatala Padha Yatra

 

ఈటల ప్రజా జీవన యాత్ర..

 

🔹వీర తిలకం దిద్ది, సాగనంపిన సతీమణీ జమున
🔹23 రోజుల పాదయాత్ర ప్రారంభం
🔹పాదయాత్రను అడ్డుకునే కుట్ర..
🔹తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారన్న ఈటల
🔹కేసీఆర్ సర్కారుపై భగ్గుమన్న ఈటల రాజేందర్

 

కరీంనగర్ (ప్రశ్న న్యూస్) ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గ పాదయాత్ర సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈటల సతీమణి జమున ఆయనకు వీర తిలకం దిద్ది, మంగళహారతిచ్చి యాత్రకు పంపారు. కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ఈటల తన పాదయాత్రను మొదలుపెట్టారు. ముందుగా బత్తినివానిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. 107 గ్రామ పంచాయతీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. 23 రోజులపాటు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతులు తీసుకున్నా.. అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోతామనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము మధ్యాహ్న భోజనం కోసం ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటుంటే.. ఆ రైస్ మిల్ యజమానులను భయపెట్టి తమ వంట సరుకులను సీజ్ చేశారని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కనుసన్నల్లో, పరకాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అప్రజాస్వామిక పనులకు తెరలేపారని మండిపడ్డారు. తనకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులున్నాయన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ పాదయాత్ర అని.. టీఆర్ఎస్ పాదయాత్ర కాదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని.. ఈ విషయం ఓ మాజీ నక్సలైట్ ద్వారా తెలిసిందని ఈటల తెలిపారు. నాడు నరహంతకుడు నయీమ్ చంపుతానంటేనే భయపడలేదని.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసినవాడినని అన్నారు. దళితబందును స్వాగతిస్తున్నామని, ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చుడు కాదు.. ప్రతి నియోజకవర్గంలో 10వేల మందికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు. చల్లా ధర్మారెడ్డి భరతం పడుతామన్నారు. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం సీఎం కేసీఆర్‌కు అలవాటేనని ఈటల ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామని తెలిసే దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటున్నారని విమర్శించారు.