KCR

 

ఈటెల టార్గెట్ గా కేసీఆర్ కోవర్ట్ ఆపరేషన్.?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటెల రాజేందర్ కాషాయ దళంలో చేరిపోయారు. కెసిఆర్ పై సమరానికి సై అంటున్నారు. అయితే రాజకీయాల్లో శత్రువులను అణిచివేయడంపై అపర చాణిక్యం ప్రదర్శించే కెసిఆర్ ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ ను,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను రంగంలోకి దించి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ టార్గెట్ గా కోవర్ట్ ఆపరేషన్ కూడా చేయనున్నారని స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.నిన్నమొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో ఉండి, మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, అసైన్డ్ భూములు కబ్జా చేసిన ఆరోపణలతో పార్టీ నుండి అత్యంత దారుణంగా బర్తరఫ్ చేయబడిన ఈటెల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఒకపక్క ఈటెల రాజేందర్ తన బలం ఏ మాత్రం తగ్గకుండా చాపకింద నీరులా పని చేసుకుంటూ పోతుంటే, ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడం కోసం సీఎం కేసీఆర్ సైతం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

హుజురాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్ పై దృష్టిసారించిన కెసిఆర్ ఈటెల రాజేందర్ కు కోలుకోలేని దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనప్పటికీ, ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉపఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈటెలకు మద్దతు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఈటెలతో పాటు బిజెపి బాటపట్టారు .అయితే వీరంతా ఏ మేరకు ఈటెలకు మద్దతుగా ఉంటారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. వీరిలో కొందరు కోవర్టులు ఉన్నారని అనుమానం వ్యక్తం అవుతుంది. వారికి పెద్ద ఎత్తున ప్యాకేజీలు కూడా ఇచ్చినట్టుగా చర్చ జోరుగా సాగుతుంది. సీఎం కేసీఆర్ ఈటెల రాజకీయ భవిష్యత్ కు చెక్ పెట్టే విధంగా ఊహించని ఎత్తుగడలను వేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ఈటెల రాజేందర్ రానున్న ఉప ఎన్నిక నేపథ్యంలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు,టీఆర్ఎస్ పార్టీ నేతలకు చేరవేసే అవకాశం లేకపోలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క టిఆర్ఎస్ పార్టీలో సైతం ఈటెల అభిమానులు ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలలోనూ భయాందోళన నెలకొంది. దీంతో అటు టిఆర్ఎస్ లోనూ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఏదిఏమైనప్పటికీ అధికారపార్టీ అయిన టిఆర్ఎస్ ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడం కోసం కోవర్ట్ ఆపరేషన్ కు తెరతీసింది అని చర్చ జరుగుతున్న సమయంలో కోవర్ట్ ఆపరేషన్ లో ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు ఫెయిల్ అవుతారు అన్నది తెలియాల్సి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గం లో ముందు ముందు ఏం జరగబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.