kodandaram

 

ఈ ప్రభుత్వం లో కొత్త ఉద్యోగాలు వచ్చేనా..? – ప్రో. కోదండరాం

 

 * ఉద్యోగాల నోటిఫికేషన్ పై ప్రభుత్వం దోబూచులాట

* నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్దేది.?

* ఉద్యోగాల భర్తీ కేవలం ఎన్నికల నినాదమేనా

* ఖాళీల లెక్కలు పై గందరగోళం భర్తీని దాట వేసేందుకేనా.?

* నిరుద్యోగ భృతి పై మీ హమీ ఏమైంది.?

* గత ఏడు సంవత్సరాలలో గ్రూప్ -1 నోటిఫికేషన్స్ ఏవి.?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల అంశం అలా తెర పైకి రావడం కొద్దిరోజులకే మరుగనపడటం కామన్ అయిపోయింది. నోటిఫికేషన్లు ఇస్తున్నామని ప్రభుత్వం హడావుడి చేయడం, ఇంతలోనే ఖాళీల లెక్క ఇంకా తేలలేదని, రిపోర్టులు అసమగ్రంగా ఉన్నాయని వాయిదా వేయడం జరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలపై నిరుద్యోగుల్లో తీవ్ర నిస్తేజం, అసంతృప్తి నెలకొన్నాయి. తాజాగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఖాళీల లెక్కను రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్దారించింది. దీంతో ఈసారైనా ప్రభుత్వం నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.? నిరుద్యోగుల కష్టాలు తిరుతాయా అనే చర్చ జరుగుతోంది.
ఊరించి ఉసూరు మనిపించి-నిరుద్యోగులతో కేసీఆర్ సర్కార్ చెలగాటం ఎన్నికల ఎత్తుల్లో భాగమేనా అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రో. కోదండరాం ప్రశ్నించారు.తేలిన ఉద్యోగ ఖాళీల లెక్క..

రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో మొత్తం 67,820వేల ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ నిర్దారించింది. తుది నివేదికను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ రేపో మాపో దాన్ని ప్రభుత్వానికి సమర్పించనుంది. నిజానికి గత మే నెలలోనే ఉద్యోగ ఖాళీల వివరాలతో కూడిన నివేదిక కేబినెట్‌ ముందుకు వచ్చింది. నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించారు. అయితే నివేదిక అసమగ్రంగా ఉందన్న కారణంతో దాన్ని తిరస్కరించారు. మరోసారి కసరత్తు చేసి కచ్చితమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయా శాఖల్లోని ఖాళీలన్నీ లెక్క తీసిన అధికారులు మొత్తం ఖాళీలను నిర్దారించారు.

నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా… ?

ఖాళీల వివరాలతో కూడిన నివేదిక కేబినెట్‌కు చేరాల్సి ఉంది. కేబినెట్ ఆమోద ముద్ర పడితే నోటిఫికేషన్లు విడుదలవుతాయి. అయితే కేబినెట్ ఈసారైనా నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికకు ముందే నోటిఫికేషన్ ఇస్తారా..? లేక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే దాకా వేచి చూసి ఉపఎన్నిక అయిపోయాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని చెబుతారా అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఇది ఎన్నికల మోసం గానే కోదండరాం విమర్శించారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులు ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్ఎస్‌కు ఉద్యోగాల నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని ఆ తర్వాత దాని సంగతి మరిచిపోవడం సాధారణమే ఆని తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు.

నిరాశలో నిరుద్యోగులు..

నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచిన..
గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసింది. దాదాపు 8 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. మధ్యలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక,ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో వాటి తర్వాత నోటిఫికేషన్లు వస్తాయేమోనని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారు. కానీ నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రేపో మాపో అంటూ ప్రభుత్వం దీన్ని సాగదీస్తూనే ఉంది. నీళ్లు,నిధులు,నియామకాలు అనే నినాదంపై ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వం నియామకాలను అటకెక్కించిందని, నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ప్రో. కోదండరాం విమర్శించారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని మరో 50వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని చెబుతూ వస్తోంది. కానీ ఇప్పటికీ ఆ 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాలేదు. మరోవైపు ఏజ్ బార్ అయిపోయి కొంతమంది నిరుద్యోగులు అనర్హులుగా మారుతున్న పరిస్థితి. వారికి వయసు సడలింపునిచ్చే చర్యలేవీ ఇప్పటివరకూ తీసుకోలేదు.

నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగులు..

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి ఇప్పటికే కొంతమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 35-40 ఏళ్లు నిండుతున్నా ఉపాధి,ఉద్యోగం లేక, పెళ్లి కాక, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన స్థితిలో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు 30 మంది యువతీ యువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని కలత చెంది, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నారని దీనిపై కనీసం ప్రభుత్వం స్పందన లేదని నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని కోదండరాం అక్రోశం వెల్లగక్కారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడం,ఆత్మహత్యలు కొనసాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.

 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు..

నిజానికి తెలంగాణలోని వివిధ ప్రభుత్వశాఖల్లో మొత్తం 3 లక్షల 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే వాదన ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు ఏమాత్రం సుముఖంగా లేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లుగా ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదని, రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 35,460 మాత్రమే కాగా ప్రభుత్వం మాత్రం 1లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు లెక్కలు చెబుతోందని కోదండరాం విమర్శించారు. మరోవైపు,నిరుద్యోగ భృతి అంశాన్ని కూడా ప్రభుత్వం అటకెక్కించింది. గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చారు. ప్రతీ నిరుద్యోగికి రూ.3వేలు భృతి చెల్లిస్తామన్నారు. కానీ ఇప్పటికీ అది కూడా అమలుకు నోచుకోలేదని తీవ్రస్థాయి లో విరుచుకు పడ్డారు ప్రొఫెసర్ కోదండరాం.