Cabinet Meet

 

ఈ వారమే మోదీ కేబినెట్ విస్తరణ

 

🔹కేంద్ర మంత్రివర్గంలోకి 28 మందికి అవకాశం..

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలోనే పలువురు కేంద్రమంత్రివర్గంలోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ మంత్రివర్గ విస్తరించడం ఇదే తొలిసారి అవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. కేంద్రమంత్రివర్గంలో కనీసం 81 మందికి అవకాశం ఉంది. ప్రస్తుం 53 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్తగా 28 మందిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇప్పటికే కొందరు కేంద్రమంత్రులు నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలను కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అస్సాంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రిగా ఉన్న శర్బానంద సోనోవాల్‌ను కొనసాగించకుండా హిమంత బిశ్వశర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం సోనోవాల్‌ను తిరిగి కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, మహారాష్ట్ర నేత నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్, ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ లకు కూడా కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎక్కువ మందికి కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్నా దల్ నుంచి అనుప్రియా పటేల్ కాకుండా ఫిలిబిత్ ఎంపీ, మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ, రామ్ శంకర్ కథారియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాంలకు కూడా కేంద్రమంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి.

ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్, అనిల్ బలూనీ, కర్ణాటక నుంచి ప్రతాప్ సింహాలకు చోటు దక్కే అవకాశం ఉంది. హర్యానా నుంచి బ్రిజేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి పూనమ్ మహాజన్ లేదా ప్రీతమ్ ముండేలకు, ఢిల్లీ నుంచి పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖిలకు కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమై వీరిలో ఎవరి కేబినెట్ బెర్త్ ఇస్తారనేది ఖరారు చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ శనివారం, ఆదివారం ఈ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది.