ఉద్యమకారుల ఊసేది

 

🔹జాడలేని సీనియర్లు
🔹తొలి దశ ఉద్యమకారుడు, బుద్ధులు నేర్పిన సిద్దులుసారెక్కడ
🔹కొండముక్కల సాయి జాడ యాడ
🔹దీన స్థితిలో పార్టీ తొలి తరం నాయకులు
🔹పట్టించుకునే నాయకుడేడి
🔹అవసరం తీరాక అల్లుడు సామెతేనా
🔹ప్రక్షాళన చేయకపోతే పుట్టి మునగడం తప్పదా

 

(పూనెం ప్రదీప్ కుమార్- ప్రశ్న న్యూస్ బ్యూరో)
తెలంగాణ… ఆ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకొని, ఉచ్వాస, నిచ్వాసలు, గుండె చప్పుళ్ళు ఆకాశమే హద్దు అన్నంత ఉద్వేగ భరితంగా మారుతుంది. తెలంగాణ అనే పేరులో ప్రతి అక్షరం ఓ అగ్గి బరాటా గా పనిచేసింది. పసి పిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి యుద్ధం చేశారు. తెలంగాణ ప్రాంత అటు సరిహద్దు నుండి పూర్వ భద్రాచలం నియాజకవర్గ సరిహద్దు మోతుగుడెం వరకు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. ఉద్యమ నాయకుల నుండి ఎప్పుడు పిలుపు వచ్చిన యుద్ధానికి సిద్ధమైన సైనికులవలె ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రాన్ని స్తంభింపజేశారు. మా తెలంగాణ మాకంటూ నినాదాలతో హోరెత్తించారు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనే నినాదాలతో, ఎజెండాతో తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేకమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊది అనేకమంది ప్రజలు అసువులు బాసారు. వందలాది మంది ప్రజల బలిదానాల తర్వాత జూన్ రెండవ తేదీ 2014 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నాయకులు, కార్యకర్తలు తప్ప, మెజారిటీ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు మొండి చెయ్యి ఎదురైంది. లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి నిలిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకు దెరువు పోరాటం చేస్తున్నారు. నిజమైన ఉద్యమకారులు కంటికి కనిపించడం లేదు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఉద్యమాన్ని అవహేళన చేసినవారు, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినవారు, అసలు స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఈ రోజు పదవులను, అధికారాన్ని అనుభవించటం సిగ్గుచేటు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం భద్రాచలం. ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసించే భూభాగం, సమైఖ్య భావజాలం  ఎక్కువగా ఉన్న భద్రాచలంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేకమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతంలో పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చింది. తెరాస పార్టీ నుండి  అనేకమంది ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసి మెజార్టీ ఓట్లు కూడా సాధించుకున్నారు. దీనికి కారణం ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొంతమంది విలువలు కలిగిన నాయకులే కారణమని ఘంటాపధంగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండవ సారి అధికారంలోకి వచ్చినా కూడా వీరికి ఎటువంటి న్యాయం జరగకపోవడం బాధాకరం. 2001 సంవత్సరంలో  తెరాస పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి నమ్మకం గా పనిచేసిన నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు జీవన పోరాటం కొనసాగిస్తున్నారు. భద్రాచలం ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ముఖ్యనేతలుగా పనిచేసిన నూకపేయి నరసింహమూర్తి, కొండముక్కల సాయిబాబు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తెలంగాణ కాంక్షతో ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా గులాబీ జెండా భుజాలకెత్తుకొని పనిచేసిన నరసింహమూర్తి, ఇంటిలోని మంచాలు, చేతి ఉంగరాలు అమ్మి పార్టీ ప్రచారానికి తిరిగిన నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు కొండ ముక్కల సాయిబాబును నేడు ఎవరూ పట్టించుకోకుండా చిన్న చూపు చూడడం బాధాకరం. 1969 ఉద్యమకారుడు, అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యుడు తిప్పన సిద్ధులు కనుమరుగై పోయాడు. 1969 ఉద్యమ సమయంలో అనేకమంది మేధావులతో రాష్ట్ర అ నాయకులతో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి తో పని చేసి తెలంగాణ కోసం పోరాడిన యోధుడు ఆచార్యుడు సిద్ధులు సారు. మలిదశ ఉద్యమంలో కూడా అనేక పోరాటాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనకై అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పాలకులు పట్టించుకోక నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురై ఒంటరిగా మిగిలిపోయాడు. తాళ్ల రవి కుమార్ టైలరింగ్ చేస్తూ  జీవనం సాగిస్తున్నాడు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చాట్ల రవి, బొట్టు శ్రీను, వి బి చారీ, నూకపేయి రాజేంద్ర వర్ధన్, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన మైకు కట్టుకొని సైకిల్ మీద రాష్ట్రం మొత్తం తిరిగే ఆర్ఎంపి ప్రకాష్ ను పట్టించుకున్న నాయకుడే లేడు. భద్రాచలం డివిజన్ లో ఒకప్పుడు వెలిగిన అనేక మంది నాయకులు చీకట్లో మగ్గిపోతున్నారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే సామెత చందంగా మారింది ఉద్యమకారుల పరిస్థితి. పార్టీలో అనేక పదవులు అనుభవిస్తున్న వారు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నలేకపోగా వ్యతిరేకించినవారే నేడు వెలిగిపోతున్నారు. సీనియర్ల అనుభవాన్ని, పరిచయాలను పూర్తి స్థాయిలో పార్టీ వినియోగించుకోవడం వల్లనే అనేక మార్లు పార్టీ భద్రాచలం ప్రాంతంలో ఓటమి పాలు అవుతూ వస్తుందనేది సత్యం. ఉద్యమంలో పోరాడిన వారికి ఎటువంటి పార్టీ పదవులు లేవు. పైరవి కారులకు పదవులు, అధికారం కాంట్రాక్టులు ఇలా అనేక  రకాలుగా  లాభపడుతున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులను సైతం వీరే  చేజిక్కించుకుంటూ, వీరు చెప్పినవారికి మాత్రమే అనేక సొసైటీలకు డైరెక్టర్లుగా, చైర్మన్లుగా  పదవులు వచ్చేలా పందేరాలు కొనసాగిస్తున్నారు. అసలు సిసలు ఉద్యమ నాయకుల ఊసేక్కడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా ఉద్యమకారులను చేరదీసి వాళ్లకి సముచిత స్థానం కల్పిస్తేనే తెరాస పార్టీకి భద్రాచలం ప్రాంతంలో పట్టు లభించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో భద్రాచలం ప్రాంతంలో అనేకమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు,  రాష్ట్ర స్థాయి నాయకులు పర్యటిస్తున్న నిజమైన ఉద్యమకారులను, నాయకులను పట్టించుకోకపోవడం శోచనీయం. పార్టీ అగ్రనాయకత్వం  నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోతే మరోసారి  తెరాస పార్టీ కి ఎదురు దెబ్బ తప్పదనేది బహిరంగ రహస్యం. ఇకనైనా ఒంటెద్దు పోకడలు, వర్గ రాజకీయాలు మానుకొని, పైరవి కారులకు కొంత పక్కకు పెట్టి, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే తప్ప గట్టెక్కలేని పరిస్థితి నెలకొంది. ఈసారైనా  భద్రాచలం నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగురుతుందా లేదా అనేది వేచి చూడాలి.