abc

 

ఊపందుకున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు

 

డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.

 

సిద్ధిపేట (ప్రశ్న న్యూస్) పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం సిద్ధిపేట జిల్లాలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటనలు మొదలు పెట్టారు. జిల్లాలోని ఆయా గ్రామాలు, పట్టణాలలో అభివృద్ధి పనులను పరిశీలిస్తూ..పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ పర్యటించారు. క్షీరసాగర్ గ్రామానికి మంత్రి హరీశ్ నిధుల వర్షం కురిపించారు. రూ.1.6 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభించిన అనంతరం శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. క్షీరసాగర్ గ్రామంలో రూ.30 లక్షల రూపాయల వ్యయంతో పూర్తయిన యూజీడీ- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన తర్వాత గ్రామ మోడల్ బస్టాండ్- ప్రయాణ ప్రాంగణాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. గ్రామ మహిళలు మంగళహారతులతో కుంకుమ బొట్టు పెట్టి మంత్రిని స్వాగతించగా, గ్రామ పెద్ద, చిన్న యువతతో కలిసి బోనాలు, డప్పు చప్పుళ్లతో సందడి చేస్తూ.. మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. పల్లె ప్రగతిలో భాగంగా క్షీరసాగర్ గ్రామంలో హరితహారం కింద పల్లె ప్రకృతి వనం వద్ద మొక్కలు నాటడంతో పాటు ఇంటికి 6 మొక్కలను గ్రామ ప్రజలకు మంత్రి పంపిణీ చేశారు. గ్రామంలో రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్..రూ.50 లక్షలతో విలేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, రూ.6 లక్షలతో పల్లె ప్రకృతి వనం ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ రాక ముందు పల్లెలు ఏలా ఉన్నాయో..? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పల్లెలు ఏలా మారాయంటూ.. 70 ఏళ్లలో జరగని పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏళ్లలో జరిపి చూపారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలో చెత్త చెదారం లేకుండా ఇంటింటా చెత్త సేకరణతో డంప్ యార్డుల నిర్వహణ, శ్మశాన వాటిక, చెత్త తీసుకెళ్లేందుకు ట్రాక్టరు, ట్రాలీ.. ఇలా అన్నీ వనరులు సమకూర్చున్నామన్నారు. ఇప్పటి దాకా క్షీరసాగర్ గ్రామంలో రూ.6.62 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకున్నాం.. ఇవాళ 1.06 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టామని తెలిపారు.

త్వరలోనే గ్రామంలో పోస్టాఫీసు, లైబ్రరీ పూర్తి చేయిస్తానని గ్రామస్తులకు మంత్రి భరోసానిచ్చారు. గ్రామంలో అసంపూర్తి పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.50 లక్షలతో విలేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలు చారు. కొండ పోచమ్మ జలాశయంతో పామాయిల్ తోటల పెంపకానికి ములుగు మండలం అనువుగా మారిందని, పామాయిల్ తోటల పెంపకం కోసం మొక్కలు, ఎరువులు ఇతరత్రా పంట సాగుకయ్యే వనరులు సమకూర్చి ప్రభుత్వ సబ్సిడీ ఇస్తామని వివరిస్తూ.., పామాయిల్ తోటల పెంపకానికి ముందుకు రావాలని పిలుపినిచ్చారు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి పామాయిల్ పంట కొంటుందని అవగాహన కల్పించి మంత్రి భరోసా ఇచ్చారు. పామాయిల్ తోట పెంపకానికి ముందుకొచ్చిన రైతు బాల్ రెడ్డిని అభినందించిన మంత్రి, బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి, మొదటి ఆయిల్ ఫామ్ మొక్కను మంత్రి హరీశ్ నాటారు. వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మనం మారాలని రైతులకు పిలుపునిచ్చిన మంత్రి హరీశ్ రావు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర ప్రాంతాలకే అనుకూలంగా ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో గాలిలో తేమ శాతంతో ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలు అనుకూలంగా మారాయన్నారు. ఆయిల్ ఫామ్ లాభసాటి పంట. 60 వేల కోట్ల పామాయిల్ ఇతర దేశాల నుంచి కొనుగోలు- దిగుమతి చేసి మన దేశంలో వాడుకుంటున్నామని, మనకు మనమే పామాయిల్ తోటలు పెడితే ఎగుమతి చేసేలా ఎదుగుతామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యేడు భూమికి బరువైన దేశంలోనే అత్యధిక పంట పండింది. 52 లక్షల ఎకరాల్లో యాసంగి, 1 కోటి 40 లక్షల వడ్లు-ధాన్యం పండించిందని, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం -వడ్లు ఎఫ్ సీఐ కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.