ts cm

 

ఊరించి ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగాల భర్తీ

 

🔹నిరుద్యోగులతో కేసీఆర్ సర్కార్ చెలగాటం
🔹రెండు రోజుల కేబినెట్‌లో ఏం తేల్చలేదు..
🔹ఎన్నికల స్టంటేనా..?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ విషయంలో కేసీఆర్ సర్కార్ తీరు ‘అదిగో… ఇదిగో…’ అన్నట్లుగానే ఉంది. 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏడు నెలల క్రితం చేసిన ప్రకటన ఇప్పటికీ ఆచరణ రూపం దాల్చలేదు. ‘త్వరలో’ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురూ అని నిరుద్యోగులను ఊరించడం తప్పితే… ఆ ‘త్వరలో’ అనే పదానికి ఇప్పటికీ మోక్షం లేదు. తాజాగా వరుసగా రెండు రోజుల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించినా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఎటూ తేల్చలేదు. ఖాళీల వివరాలు అసమగ్రంగా ఉన్నాయని… మరో ఐదు రోజుల్లో సమగ్ర వివరాలు సమర్పించాలంటూ మరోసారి సాగదీసే ప్రయత్నమే చేశారు.దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రమవుతోంది.ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులు ఇప్పటికే విసిగి వేసారిపోయారు. కేసీఆర్ సర్కార్ ఇక నోటిఫికేషన్లు ఇవ్వదని నిర్ణయించుకుని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రేపు… మాపు అంటూ కాలయాపన చేస్తూనే ఉంది. దాదాపు వారం రోజుల క్రితం 50వేల ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 3,4 రోజుల్లో నోటిఫికేషన్లు వస్తాయేమోనని ఆశగా ఎదురుచూశారు. కానీ ఎప్పటిలాగే ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేసే ప్రయత్నమే జరిగింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు మళ్లీ సన్నగిల్లుతున్నాయి.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు అసమగ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో ఐదు రోజుల్లో మంత్రి హరీశ్ రావు నేత్రుత్వంలోని కమిటీకి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. దీంతో కొలువుల భర్తీ ప్రక్రియ అంశంపై ఎటూ తేల్చకుండానే కేబినెట్ సమావేశం ముగిసింది. వరుసగా రెండు రోజుల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించడం… కొలువుల అంశానికి ప్రాధాన్యతనివ్వడంతో… ఈసారైనా ఇది ఓ కొలిక్కి వస్తుందేమోనని అంతా భావించారు. కానీ ప్రభుత్వ నిర్ణయం మళ్లీ విమర్శలకు తావిచ్చేలా ఉంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ప్రభుత్వం కొలువుల భర్తీ ప్రక్రియను తెర పైకి తీసుకురావడం కామన్‌ అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు,సెటైర్లు కనిపిస్తున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే ప్రభుత్వం మళ్లీ కొలువుల నాటకానికి తెరలేపిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే 50వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసిన ప్రభుత్వం… ఇప్పటికీ కనీసం నోటిఫికేషన్లు ఇవ్వలేదంటే చిత్తశుద్ది లేకపోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని… ఇంకెన్ని రోజులు దీన్నిలా సాగదీస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఖాళీల లెక్క తేల్చడానికి ప్రభుత్వ అధికారులు నెలల తరబడి సమయం తీసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరా లేక ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మరింత జాప్యం చేయాలనుకుంటోందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే నిరుద్యోగుల్లో కేసీఆర్ ప్రభుత్వంపై పీకల్లోతు ఆగ్రహం ఉన్నది. కొలువుల భర్తీ ప్రక్రియ షురూ అన్న ప్రతీసారి.. ‘మాకు నమ్మకం లేదు సారూ…’ అన్న ప్రతిస్పందన వస్తోంది. దీన్నిబట్టి నిరుద్యోగులు ఎంతలా విసిగి వేసారిపోయారో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మున్ముందు భారీ మూల్యం తప్పకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలన్ని నిరుద్యోగ అంశంపై పెద్ద ఎత్తున పోరాడేందుకు సిద్దమవుతున్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల సైతం నిరుద్యోగ దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ఇదే వైఖరిని కొనసాగిస్తే డ్యామేజ్ తప్పకపోవచ్చు.