ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు.. ఏళ్లు గడిచిన చార్జిషీట్లు లేవెందుకు.?
సీబీఐ, ఈడీకి సుప్రీం సీరియస్
సుప్రీం కీలక ఆదేశం
కేసుల పర్యవేక్షణకు మరో కొత్త వ్యవస్ధ
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుల్ని తేల్చేందుకు దేశంలోని హైకోర్టులకు ఏడాది గడువు పెట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీకి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్ధ తరహాలోనే సీబీఐ, ఈడీపైనా భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్ధానం.. అయినా సరే ఈ కేసుల్ని తేల్చేయాల్స్ందేనని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందలాది ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రీమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో సీబీఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. వీటి దర్యాప్తు, విచారణ నానాటికీ ఆలస్యం అవుతుండటంపై గతంలోనే సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల పెండింగ్ కారణంగా ఆయా ప్రజాప్రతినిధులు ప్రజల్ని మభ్యపెట్టి మళ్లీ మళ్లీ ఎన్నికల్లో గెలవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతోందని తెలిపింది. ఈ కేసుల విషయాన్ని త్వరలో తేల్చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల దర్యాప్తు, విచారణల ఆలస్యంపై ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోర్టులకు డెడ్ లైన్ పెట్టింది. ఏడాది లోగా ఈ కేసుల్ని తేల్చేయాలని హైకోర్టులతో పాటు ట్రయల్ కోర్డులకూ సూచించింది. దీంతో ఇప్పటికే పలు హైకోర్టులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి విచారణలు చేపడుతున్నాయి. తమ కింద ఉన్న ట్రయల్ కోర్టుల్ని కూడా ఈ కేసుల్లో విచారణలు వేగవంతం చేయాలని పాలనాపరమైన ఆదేశాలు జారీ చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన సీబీఐ, ఈడీ కేసుల్లో దర్యాప్తులు నత్తనడకన సాగుతుండటం వల్ల కోర్టుల్లో కేసుల విచారణ కూడా అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీంతో తాజాగా కేసుల దర్యాప్తులు వేగవంతం చేయడానికి తగిన సిఫార్సులు చేయాలని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియాను ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసిన విజయ్ హన్సారియా తాజాగా పలు సిఫార్సులు చేశారు. వీటిపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్లో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ల దాఖలుపై దృష్టిసారించాలని సీబీఐ, ఈడీకి ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్ధ తరహాలోనే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలపైనా భారం పెరుగుతోందని, సిబ్బంది కొరతతో పాటు ఇతర సమస్యలే కారణమని సీజే ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయినా ప్రజా ప్రతినిధులపై కేసుల్లో ఛార్జిషీట్ల దాఖలులో ఆలస్యం చేయొద్దని ఆయన ఆదేశాలు ఇచ్చారు. చాలా కేసుల్లో ఏళ్ల తరబడి ఛార్జిషీట్లు దాఖలు కాకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్ధల్ని సీజే రమణ ప్రశ్నించారు. ఓ కేసులో అయితే ఏకంగా రూ.200 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసి కూడా ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడమేంటని ఈడీని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు, విచారణలు నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో వీటి పర్యవేక్షణకు త్వరలో కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తెస్తామని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీరమణ వెల్లడించారు. ఇందులో ప్రత్యేక కోర్టులు కూడా ఉంటాయని సీజే రమణ తెలిపారు. ఈ మేరకు తాజాగా అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా చేసిన సిఫార్సును సుప్రీంకోర్టు ఆమోదించింది. తద్వారా ఈ కేసుల విచారణను ఎట్టి పరిస్దితుల్లోనూ ఆలస్యం కానీయకుండా చూడాలని సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది.