ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్ర కోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, రాబోయే 25 ఏళ్లలో దేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా, 100 లక్షల కోట్ల రూపాయలతో గతిశక్తి ప్రణాళికను త్వరలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇవీ ప్రధాని ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలు:
టోక్యో ఒలింపిక్స్‌లో ఘన విజయాలు సాధించి భారతావనికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు మనతో ఉన్నారు. దేశమంతా ఈరోజు వారిపై ప్రశంసల కురిపించాలని కోరుతున్నా. వారు మన హృదయాలను గెలవడమే కాదు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చారు.
మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, ప్రతి సవాలునూ అనూహ్యమైన వేగంతో ఎదుర్కొన్నాం. కోవిడ్ వైరస్‌తో పోరాడడంలో భారతీయులు చూపించిన సహనం, శక్తి నిరుపమానం. ఈరోజు భారతదేశం వ్యాక్సీన్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదంటే, ఆ ఘనత అంతా మన శాస్త్రవేత్తలది, పారిశ్రామికవేత్తలది.
దేశ విభజన నాటి మరుపురాని గాయాలను, త్యాగాలను స్మరించుకోవడం కోసం ఆగస్ట్ 14ను ‘పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే’గా గుర్తిద్దాం.
భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సం జరుపుకునే నాటికి మనం ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలను పరిపూర్ణంగా సాధించేందుకు కృషి చేయాలి. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదాలకు సబ్ కా ప్రయాస్ కూడా జోడిద్దాం. నవ భారత నిర్మాణ లక్ష్యాన్ని సమష్టి కృషితోనే మనం చేరుకోగలం.
పట్టణాలు, పల్లెలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తుడిచేయాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలి. అందుకోసం, దళితులు, ఎస్టీ, వెనుకబడిన కులాలు, ఇతర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు అందేలా చూస్తున్నాం.
రూ. 100 లక్షల కోట్లతో ‘ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ను త్వరలో ప్రారంభిస్తాం. సమగ్ర ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే విధంగా పరిపూర్ణమైన మౌలిక వసతుల సృష్టికి ఈ ప్రణాళిక దోహదపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడేందుకు, భవిష్య ఆర్థిక మండలాల సృష్టికి, ఉద్యోగాల కల్పనకు ఈ ప్రణాళిక అండగా ఉంటుంది.
భారత స్వతంత్ర అమృత మహోత్సవంలో మొదటి 75 వారాల్లో 75 వందేభారత్ రైళ్ల సేవలను ప్రవేశపెడతాం. ఈ రైళ్లు భారతదేశంలోని అన్ని మూలల్నీ అనుసంధానం చేస్తాయి.
ఇక మన లక్ష్యం 100% పల్లెలకు రోడ్లు, 100% బ్యాంకు అకౌంట్లు, 100% మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు, 100% ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు.
బాలికల కోసం కూడా దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ప్రారంభిస్తాం.
భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతలందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూజీ, సమైక్య భారతం కోసం కృషి చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్, భారతదేశ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్‌లకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.