water

 

ఏపీ వర్సెస్ తెలంగాణ

 

🔹ఏపీ అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి..
🔹తెలంగాణ సర్కార్ ను కోరిన కేఆర్ఎంబీ
🔹తెలంగాణ ప్రభుత్వ వివరణ ఎలా ఉంటుందో ?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిలుపుదల చేయడంతో మొదలైన వాటర్ వార్ ప్రస్తుతం పవర్ వార్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ డ్యాం నుండి, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతులు లేకుండా నీటిని వినియోగించడాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం దీనిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. ఇక నాగార్జునసాగర్ డ్యాం నుండి కేటాయింపులకు మించి తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ తెలంగాణా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కోరింది.ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టిఎంసిల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకున్న ఏపీ అభ్యంతరాలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది.

అంతేకాకుండా ఇప్పటివరకు సాగర్ నుండి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణా కు సూచించింది. త్వరలోనే కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొంది. జూలై 7వ తేదీలోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్న నేపథ్యంలో వచ్చే సమావేశం నాటికి దీనికి సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణ రెడ్డి ఇటీవల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. గత నీటి సంవత్సరంలో నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల చేయవద్దని కోరినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుండి మే 31 వరకు 13.4716 టీఎంసీలను అనవసరంగా విడుదల చేశారని, వాటిని ఏపీ కోటా నుండి మినహాయించాలని నారాయణ రెడ్డి తాను రాసిన లేఖలో ప్రస్తావించారు.ఈ క్రమంలో తెలంగాణ ఈఎన్సి మురళీధర్ ను ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై తెలంగాణ ప్రభుత్వ వివరణ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ తెలంగాణ ప్రభుత్వ వివరణకై లేఖ రాసింది. త్వరలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఏం సమాధానం చెబుతుంది. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్ట్ ల వద్ద ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి.