modi

 

ఐక్యరాజ్యసమితి ‘భద్రతా మండలి’కి అధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రధాని

 

🔹సముద్ర వాణిజ్యం, భద్రతకు ప్రధాని మోదీ ఐదంచెల వ్యూహం

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రపంచంలోనే శక్తిమంతమైన కూటమిగా పేరున్న ఐక్యరాజ్యసమితిలో అతి కీలకమైన ‘భద్రతా మండలి’ విభాగానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. యూఎన్ఎస్సీ అధ్యక్ష హోదాలో ప్రపంచ దేశాలను ఉద్దేశించి సోమవారం ఆయన వెలువరించిన కీలక సందేశం ఆకట్టుకున్నది. ప్రధానంగా సముద్రతల వాణిజ్యం, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ అంశాలను మోదీ హైలైట్ చేశారు. సముద్రతలం పరిరక్షణకు భారత్ రూపొందించిన సాగర్ విజన్ ను ఆయన చాటిచెప్పారు. వివరాల్లోకి వెళ్తే సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అతి త్వరగా అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సముద్ర మార్గంలో వాణిజ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిందేనని సూచించారు. దేశాల మధ్య సముద్ర సహకారం పెంచడానికి భారత్ సిద్ధం చేసిన కీలక సూత్రాలను ఆయన ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)లో సోమవారం సముద్ర భద్రత అంశంపై వర్చువల్‌గా మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు కూడా ఆయనే కావడం గమనార్హం.

సముద్ర మార్గాలు ప్రపంచ దేశాలకు దక్కిన వారసత్వ సంపద అని, ఈ మార్గాలు ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి అని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి మార్గాలు పైరసీ కోసం, తీవ్రవాదుల కోసం దుర్వినియోగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే అనేక దేశాల మధ్య సముద్ర వివాదాలు ఉన్నాయన్నారు. వీటిని శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర వాణిజ్యం పెరగాలంటే ఇటువంటి అవరోధాలన్నీ తొలగాలన్నారు. అదే సమయంలో పైరసీకి చెక్ పెట్టాలంటే సముద్ర మార్గం ద్వారా వాణిజ్యంపై గల పరిమితులు (ఆంక్షలు) తొలగాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. వీటిని పైరసీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సముద్ర వాణిజ్యాన్ని, భద్రతను మెరుగుపర్చుకోవడంతోపాటు సముద్ర సంబంధ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన గొప్ప ఆవశ్యకత మనకుందని మోదీ వక్కాణించారు. ప్లాస్టిక్ వేస్ట్ కి స్వస్తి చెప్పాలని, అవసరానికి మించి మత్స్య సంపదను కొల్లగొట్టడమనే ఓవర్ ఫిషింగ్ సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గాల ద్వారా దేశాల మధ్య సాన్నిహిత్యం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. సముద్ర భద్రతకు సంబంధించిన ఐదంచెల వ్యూహాన్ని ప్రకటించారు. భారత్ విజన్ సాగర్‌ను ఆయన వివరించారు. విజన్‌ సాగర్‌తో సముద్ర భద్రతపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు భద్రత, రక్షిణ, స్థిరత్వాన్ని.. విజన్‌ సాగర్‌ కల్పింస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజన్’ అన్నదే దీని సాగర్ ఉద్దేశం. అన్ని దేశాలూ తమలో తాము సహకరించుకోవాలంటే సముద్ర మార్గాలను వినియోగించుకోవాలన్నదే భారత్ రూపొందిచిన సాగర్ విజన్ ధ్యేయమని ప్రధాని వక్కాణించారు. 2019 లో ఈస్ట్ ఏషియా సమ్మిట్ లో కూడా ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనీషియేటివ్ ద్వారా దీనిపై విస్తృత చర్చ జరిగింది. యూఎన్‌ఎస్సీలో బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటంతో మోదీకి ఈ అవకాశం లభించింది. భద్రత మండలి సభ్య దేశాల నేతలు, ఐరాస అనుబంధ సంస్థలతో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ చర్చలో పాల్గొన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యురాలైన (నాన్‌ పర్మనెంట్‌ మెంబర్‌) అయిన భారత్‌కు రొటేషనల్‌ పద్ధతిలో ఆగస్టు నెలకు భద్రత మండలి అధ్యక్ష స్థానం లభించింది. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష స్థానంలో ఉండటం భారత్‌కు ఇది పదోసారి. అంతకుముందు 1950 జూన్‌, 1967 సెప్టెంబరు, 1972 డిసెంబరు, 1977 అక్టోబరు, 1985 ఫిబ్రవరి, 1991 అక్టోబరు, 1992 డిసెంబరు, 2011 ఆగస్టు, 2012 నవంబరులో భారత్‌ అధ్యక్ష స్థానంలో ఉంది. అయితే ఆ సమయాల్లో ఎలాంటి బహిరంగ చర్చలు జరగలేదు. ఇదిలా ఉంటే, ఐరాస భద్రతా మండలిలో అధ్యక్షహోదాలో సముద్ర వాణిజ్యం, భద్రతపై కీలక ప్రసంగం చేయానికి ముదు, నరేంద్ర మోదీ.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద 9వ విడతగా రైతులకు రూ.19,500 కోట్లను విడుదల చేశారు. లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా ఈ నిధులు జమ అవుతాయి. తద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో వివిధ రాష్ట్రాల రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. తాజాగా విడుదల చేసిన పీఎం కిసాన్ నిధి డబ్బులు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని, లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ‘కిసాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ పథకం కూడా ఈరోజుతో ఏడాది పూర్తయిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో చేపట్టిన మిషన్ హనీ-బీ ద్వారా రూ.7 లక్షల కోట్ల విలువచేసే తేనె ఎగుమతి అవుతుందని, రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి మన వ్యవసాయం, మన రైతుల భూమిక చాలా కీలకంగా మారుతుందని ప్రధాని చెప్పారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా కనీస మద్దతు ధరకు రైతుల ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, తద్వారా రూ.1,70,000 కోట్లు రైతుల అకౌంట్లకు నేరుగా చేరిందని, గోధుమ రైతులకు రూ.85,000 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్పారు. వ్యవసాయ ఎగుమతుల విషయంలో ప్రపంచంలోనే టాప్-10 దేశాల్లో తొలిసారి భారత్ చేరిందని తెలిపారు. దేశ వ్యవసాయ విధానాల్లో తొలిసారి చిన్న రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పారు.