కన్య (Virgo) 2022-2023

కన్య (Virgo) 2022-2023

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర రాశి ఫ‌లాలు

Virgo/Kanya/కన్యారాశి

(ఉత్తర : 2,3,4 పాదములు హస్త: 1,2,3,4 పాదములు చిత్త: 1,2 పాదములు)
(ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 04 అవమానం – 05)

ఈ రాశివారికి గురుడు ఏప్రిల్‌ 13వ తేదీ నుండి సప్తమ స్థానమందు, సువర్ణమూర్తి సర్వ సౌఖ్యములను కలుగజేయును. పరిపూర్ణమైన ఆరోగ్యము, సమాజమందు ఉన్నతులతో స్నేహము మీమాటకు ఎదురులేని పరిస్థితి, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, ఉన్నతమైన జీవనవిధానము అవలంభిస్తారు. మీ ద్వారా అత్యుత్తమ సేవలు సమాజమునకు అందుతాయి. ప్రతీరోజు మీకో ప్రత్యేకత ఉంటుంది. నిత్యకళ్యాణము పచ్చతోరణములా జీవనము సాగుతుంది. ఎంతటి కష్టతరమైన కార్యమైననూ అలవోకగా సాధించగలుతారు. మీకొక ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుంది. వార్తల్లో ఉంటారు. దైవబ్రాహ్మణ భక్తి దేవతారాధనము, ముఖవర్చస్సు, పెరుగుతుంది. వాగ్భూషణమే అన్నిటికన్నా గొప్ప భూషణమని మీరు నిరూపిస్తారు.

కుటుంబ విషయాలపై దృష్టి సారించి సంతాన విషయమై శుభయోగములకు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. శనైశ్చరుడు ఏప్రిల్‌ 29 నుండి షష్ఠస్థానమందు కుంభరాశిలో తామ్రమూర్తిగా సుమారు రెండు మాసములు సంచరించును. ఇదికూడా చాలా అనుకూలప్రదమైన అంశము. స్థానచలనములు కలసివస్తాయి. ప్రయత్నము మీద కార్యానుకూలత కల్గుతుంది. అధికారులను ఒప్పించి మీపంథా సరైనదని నిరూపించుకుంటారు. కొన్ని ప్రతికూల శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి, వాటిని అధిగమించి, కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపిస్తారు. మీరు పనిచేసే చోట ప్రతికూలతలున్ననూ వాటిని క్రమేపీ అనుకూలంగా మార్చుకొనగలరు. మాటలలో సంయమనం పాటించుట మంచిది.

Know More Virgo/Kanya/కన్యారాశి

రాహుకేతువులు ఏప్రిల్‌ 12వ తేదీ నుండి వరుసగా అష్టమ, షష్ఠస్థానములందు లోహమూర్తులుగా సంచరింతురు. వ్యవహార ప్రతిబంధకములున్ననూ గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము అనుకూలము. ప్రయాణముల యందు చతుష్పాద జంతువుల విషయమై జాగరూకత అవసరము. కార్యసాధకులకు, కృషి వాణిజ్యము చేసేవారికి, వ్యవసాయదారులకు పంటల ద్వారా చేతికొచ్చే ఫలాన్ని అందకుండా ప్రతికూల పరిస్థితులను, ప్రతిబంధకములు కలుగజేసి అసంతృప్తి కలిగించే అంశాలను అధిగమించుటకు సదా దుర్దారాధన చేయుట మంచిది. రైస్‌ మిల్లర్లకు అనుకూల సమయం, వృత్తివ్యాపారాలు కలసివస్తాయి. సినీ కళాకారులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులు సమర్ధత చూపి సమస్యలను పరిష్కరించి సన్మానములు పొందెదరు. ధైర్యయుక్తమైన బుద్ధి పరాక్రమము అధికముగా యుంటుంది. తత్కలోచితంగా కార్యసాధనజేయగల్గుతారు.

ఉత్తర నక్షత్రమువారికి అధికార వృద్ధి, గౌరవ మర్యాదలు పొందుట, హస్తవారికి ఉన్నత విద్యాయోగం, కార్యసిద్ధి, చిత్రవారికి కళత్ర అనుకూలత, స్వతంత్ర జీవనం కల్గును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – ‘5’. 1, 3, 6, 8 తేదీల సంఖ్యలు ఆది, బుధ, గురు, శనివారములతో కలసిన మరింత యోగప్రదమగును.

నెలవారీ ఫలితములు

ఏప్రిల్‌: గ్రహస్థితి సామాన్యము, బంధు విరోధము, దైవబ్రాహ్మణ భక్తి పుణ్య క్షేత్రములను సందర్భ్శించుట, స్వకీయమగు ఉన్నత ఆలోచనలు, దూర ప్రాంతములలో నివాసములు, సంతానము వలన ఆనందము. శరీరపుష్టి.

మే: వ్యవసాయదారులకు అధిక దిగుబడుల వలన పంటలలో కలసివచ్చుట, వృత్తి వ్యాపారములలో మెళుకువగా యుండి లాభార్జన చేయుదురు.

జూన్‌: కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగులకు శాస్త్రవేత్తలకు ప్రశంసలు, వృత్తి వ్యాపారములందు పోటీతత్త్వము నడుచును. కళత్రసౌఖ్యము, మోకాళ్ళు అరికాళ్లలో నొప్పులు, శరీర ఆరోగ్యము సామాన్యము.

జూలై: సోదర సోదరీ వర్గంతో మాటపట్టింపులు, ధనవ్యయం, మిత్రుల మధ్య ఉపకార ప్రత్యుపకారములు, అపరిష్కృత సమస్యలకు ఈనెలలో పరిష్కారం కనుగొంటారు. ఉన్నతవిద్య ఉద్యోగావకాశములు విదేశీప్రయాణాలు కలసివస్తాయి.

ఆగష్టు: చేసిన పనిని మరలా చేయవలసి రావడం, కార్యాలయాల్లో పై అధికారుల వేధింపులు, ధనాభివృద్ధి అవుతుంది. అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. శుభకార్యాచరణ, విందు వినోదాల్లో పాల్గొంటారు.

సెప్టెంబర్‌: వ్యాపారస్తులపై అధికారుల నిఘా ఉంటుంది. జన్మరాశిలో బుధుడు వ్యాపారంలో అధిక ధనలాభాన్నిచ్చిన బంధనయోగం అవకాశం లేకపోలేదు. క్రోధాన్ని తగ్గించుకోవడం మంచిది. వ్యవహార ప్రతిబంధాలున్నాయి.

అక్టోబర్‌: పితృవర్గంలో ఆరోగ్యలోపం, చతుష్పాద జంతువుల వలన భయం, అధికారవృద్ధి, కళాపోషణ, దూరప్రాంతములను సందర్శించుట, కుటుంబమునకు దూరముగా గడపవలసి వచ్చుట, ధనము ఖర్చు చేయుట జరుగును.

నవంబర్‌: శరీరమున స్వస్థత యేర్పడి ఆయుర్ద్జాయము వృద్ధియగును. స్నేహితులతోనూ చుట్టములతోనూ సహపంక్తి భోజనము కుమారుల వలన సౌఖ్యము ఆకస్మిక ధనలాభములు, మనోనిబ్బరము మనస్సున ప్రశాంతత ఏర్పడును.

డిసెంబర్‌: మనోప్రశాంతత, ధీశక్తి పెరుగుట, కీర్తివృద్ధియునూ, సౌభాగ్యము ద్రవ్యాదాయము, స్త్రీసౌఖ్యము, శరీరసాంపు పెరుగును. వృత్తి ఉద్యోగాలలో వృద్ధి, పై అధికారుల అండదండలు, క్రిందివారితోనూ ఆదరణగా యుండుట జరుగును.

జనవరి 2023: ప్రయాణములో జాగరూకతగా ఉండుట అవసరము, మార్గావరోధములుండును. దూర ప్రయాణములు వాయిదా వేయుట, ఈ మాసారంభములో సామాన్య ఫలితములు, తల్లితండ్రులకు సుఖము సంతోష వివర్ధనము.

ఫిబ్రవరి: స్వబుద్ధిచే చేసిన పనులు సిద్ధించి ధనాభివృద్ధి పేరు ప్రఖ్యాతలు కల్గును. తల్లికి సుఖము, సర్వాంగముల యందు ఉష్ణతాపము కల్గును. అకస్మాత్తుగా కలహములకు అవకాశము లేకపోలేదు. నూతన వస్తువస్త్ర లాభములు.

మార్చి: గృహోపకరణ వస్తువులకు ధనము ఖర్చు చేయుదురు. విద్యా విషయములలో రాణించెదరు. ప్రతిభా పురస్కారములు లభిస్తాయి. ప్రతిభాపాటవములు ప్రదరించి ఉద్యోగమునకై చేయు ప్రయత్నములు ఫలించును.

** ** **