కరోనాకు పారాసిటమాల్, డోలో చాలు
🔹లక్షల్లో కరోనా మరణాలు.. అబ్బే అదేమీ లేదన్నట్టు సీఎం వ్యాఖ్యలు
🔹కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర అసహనం
🔹సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతల విసుర్లు
🔹రాష్ట్రమంతా సీఎం కేసీఆర్ వ్యాఖ్యల దుమారం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వరంగల్ పర్యటనలో కరోనా మహమ్మారిపై నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పారాసిటమాల్, డోలో చాలు కరోనా తగ్గిపోతుంది అంటూ, తాను రెండు గోలీలు వేసుకుంటే కరోనా తగ్గిపోయింది అంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతే, ఆసుపత్రులకు క్యూ కడితే, బెడ్ లు దొరక్క ఇబ్బంది పెడితే, ఆక్సిజన్ కోసం అల్లాడితే అసలు కరోనా మహమ్మారి లేనట్టు, అది సమస్య కానట్టు సీఎం కేసీఆర్ మాట్లాడడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.ఒకపక్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో ఎంతోమంది కుటుంబాలను ఛిద్రం చేసింది. కుటుంబాలకు కుటుంబాలే లేకుండా చేసింది. కరోనా సెకండ్ వేవ్లో విపరీతమైన ప్రభావం చూపిన మహమ్మారి తెలంగాణ రాష్ట్రంపై పంజా విసిరి వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రజలు విలవిలలాడారు. కానీ సీఎం కేసీఆర్ కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలాన్ని చూడనట్టే అసలు కరోనానే లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. కరోనా బాధితుల కుటుంబాలు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజలు సైతం పారాసిటమాల్, డోలో వేసుకుంటే చాలు అంటూ కెసిఆర్ నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరోపక్క బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం కెసిఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పై ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సీఎం, ప్రజల్ని చైతన్య పరచాల్సిన సీఎం కరోనా లేదని, బ్లాక్ ఫంగస్ లేదని చెప్పడంపై బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ప్రగతి భవన్ లో, ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ కు ఆసుపత్రులలో కరోనా రోగుల బాధలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. కరోనా లేకపోతే లాక్ డౌన్ ఎందుకు పెట్టారో చెప్పాలని నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కరోనాకు పారాసిటమాల్ చాలని చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆలోచనా ధోరణి ఆందోళనకరంగా ఉందని విజయశాంతి పేర్కొన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గతంలోను సీఎం కేసీఆర్ మాస్క్ ల పై వ్యాఖ్యలు చేశారని, పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందని చెప్పారని , సీఎం కేసీఆర్ కు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక్క హైదరాబాద్లోనే కరోనా కారణంగా లక్షమంది వరకు చనిపోయి ఉంటారని, కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి గారు మీరు ఏమైనా డాక్టరా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులే కాదు, తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నేటికి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకపక్క జనాలు కరోనాతో చనిపోతుంటే, సీఎం కేసీఆర్ కరోనాపై చాలా బాధ్యతా రాహిత్యంగా డోలో చాలంటూ నవ్వటం ఆయన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్న భావన వ్యక్తమవుతోంది. ప్రజల కరోనా కష్టాలను పట్టించుకోని సీఎం కెసిఆర్ తీరు ఇప్పుడు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారింది.