jagan

 

కరోనాపై సీఎం జగన్ సమీక్ష

🔹జగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ, మరో లేఖాస్త్రం
🔹ఏపీలో 3వ వేవ్ భయాలు

 

అమరావతి (ప్రశ్న న్యూస్) కరోనా విలయాన్ని నియంత్రించడంలో ఫెయిలయ్యారంటూ యావత్ దేశం మోదీని నిందిస్తే, దాదాపు ముఖ్యమంత్రులందరూ ప్రధానిని తప్పు పడితే, ఎన్డీఏ భాగస్వామి కానప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం పెద్దాయనకు మద్దతుగా నిలబడి, ప్రశ్నించినవాళ్లనూ కడిగిపారేసిన సందర్భం గతంలో చూశాం. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీ సీఎంలతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లోనూ కేంద్రం చేస్తోన్న సహాయానికి వేవేల ధన్యవాధాలు తెలిపారు జగన్. అదే నోటితో మోదీని ఓ చిన్న విషయం వేడుకుంటే, ఇప్పటి దాకా పెద్దాయన పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతుండటం, 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు అందజేయడానికి ఒక టైమ్ లిమిట్ అంటూ పెట్టుకోలేదని కేంద్రం చెప్పడం తెలిసిందే. ఉత్పత్తి అవుతోన్న వ్యాక్సిన్లలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఏకంగా 25 శాతం కేటాయిస్తుండటం, అందులో మెజార్టీ డోసులు వాడకుండా ఉంటోన్న వైనాన్ని ఏపీ సీఎం జగన్ పదే పదే ఎత్తిచూపుతున్నారు. ఏపీకి సంబంధించి మే, జూన్‌, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారు. ఇలా ప్రైవేటులో మిగిలిపోయిన వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించాలని ఇప్పటికి ఐదారు సార్లు కేంద్రాన్ని విన్నవించుకున్నారు. అయినాసరే, కేంద్రం నుంచి కదలిక లేకపోవడంతో మరోసారి తన వంతుగా మోదీకి లేఖ రాయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ఏపీలో కరోనా నియంత్రణ చర్యలు, మూడో వేవ్ ఎదుర్కొనే సన్నద్ధత, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సమీక్ష్ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలని, ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని,పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలని, 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు, ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ, జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని, ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని అని అధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో ఓవైపు కరోనా మూడో వేవ్ తలెత్తొచ్చన్న భయాల నడుమ అవసరమైన చర్యలకు ఆదేశాలిచ్చిన సీఎం జగన్, ఏపీలో స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నట్లు సంకేతాలిచ్చారు. ఏపీలో వచ్చే నెల 16 నుంచి అన్ని స్థాయిల స్కూళ్లు పున:ప్రారంభం కానుండటం, ఇప్పుడప్పుడే స్కూళ్లు వద్దని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోన్న క్రమంలో.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో టీచర్లకు ప్రాధాన్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలన్నారు.