kishan reddy

 

కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా..

 

🔹తెలుగు వాళ్లకి అందుబాటులో ఉంటా..
🔹బీజేపీ ఆఫీసులో సంబరాలు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముందుగా ఊహించిన విధంగానే మంత్రి కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది. దీంతో ఆయన రెండో సారి తన ప్రత్యేకతను చాటుకున్నట్లయింది. మోదీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటానని కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

కేంద్రం నుంచి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు. విభజన అంశాల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు మోదీ ఏ శాఖ కేటాయించినా చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ అందిస్తామన్నారు. తొమ్మిదిసార్లు గాంధీ ఆస్పత్రిని సందర్శించానన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన కానుక రీజినల్‌ రింగురోడ్డు అని కిషన్‌రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డికి సహాయక మంత్రి పదవి నుండి మంత్రి పదవి అని కేంద్రం ప్రకటించిన వెంటనే హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఎంపిక కావడం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంటర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.