Chandrababu

 

కృష్ణా జలాల కోసం జగన్, కేసీఆర్ కలవలేరా ?

 

🔹ఇద్దరు సీఎంలు కృష్ణా జలాలపై నాటకాలాడుతున్నారు
🔹ఎన్నికలకు ముందు కలిసి పని చేశారుగా..!
🔹ఇప్పుడేమైంది అని ప్రశ్నించిన చంద్రబాబు..

 

మచిలీపట్నం (ప్రశ్న న్యూస్) ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలపై వచ్చిన సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు చంద్రబాబు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా జలాలపై నాటకాలాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కలిసి పనిచేశారు కదా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, గత ఎన్నికలకు ముందు తనను ఓడించటం కోసం ఇద్దరూ కలిసి పని చేశారని ఇప్పుడెందుకు చెయ్యటం లేదని విమర్శించారు. గతంలోఇలానే సమస్య వస్తే తాను మాట్లాడి పరిష్కరించానని పేర్కొన్న చంద్రబాబు, అప్పుడు గవర్నర్ తోనూ, కేసీఆర్ తోనూ తాను మాట్లాడి సమస్యను పరిస్కరించానని చెప్పారు.

ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువన ఉన్న రాష్ట్రాలకు నీరు రాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తాయని, అయినా ఆ సమస్యలను పరిస్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు ముందు అప్పుడు కలిసి పనిచేసిన వారు ఇప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడుకోవడం లేదని అడిగారు చంద్రబాబు.పరిష్కారమయ్యే సమస్యలను కూడా పరిష్కరించకుండా కృష్ణాజలాలను సముద్రం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అంటూ మండిపడ్డారు. ఇక కొత్తగా వైసీపీ నుంచి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని, చదువు సంధ్య లేని, ఎక్కడి నుండి వచ్చారో తెలియని వాళ్లంతా, ఏమి మాట్లాడుతున్నారో తెలియని వాళ్ళంతా తనను ప్రశ్నిస్తున్నారని, అలాంటి కొత్త బిచ్చగాళ్లకు తాను సమాధానం చెప్పాలా అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఇక తాజాగా కృష్ణా నదీ జలాలపై చోటుచేసుకున్న వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కరించే మార్గం కనిపించటం లేదు. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయ పోరాటం చెయ్యాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నిర్ణయించుకున్న ఏపీ సర్కార్ కృష్ణా జలాలలో తమకు రావాల్సిన చట్టబద్ధమైన వెంటనే తెలంగాణ రానివ్వడం లేదని పిటిషన్లో పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆరోపించింది. తెలంగాణ తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని పేర్కొంది.