eta

కేసీఆర్‌ పాలనకు ఘోరీ కడతా – ఈటల రాజేందర్

 

🔹ఎమ్మెల్యే పదవికీ ఈటల గుడ్‌బై
🔹ఈటల రాజీనామాకు స్పీకర్ ఆమోదం
🔹ఎల్లుండి బీజేపీలో చేరిక

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) టీఆర్‌ఎస్‌తో విభేదాలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్‌బై చెప్పేశారు. ఎల్లుండి బీజేపీలో చేరికకు ముహుర్తం ఖాయం కావడంతో ఆయన తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. గన్‌పార్కులోని తెలంగాణ అమర వీరుల స్ధూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న రాజీనామాను ఆయన అసెంబ్లీ కార్యదర్శికి సమర్ఫించారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానంతో విభేదాల నేపథ్యంలో మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నేత ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యే పదవినీ వదులుకున్నారు. ఎలాగో బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్పీకర్‌ పార్మాట్‌లో తయారు చేసిన రాజీనామా లేఖను ఆయన అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. దీంతో టీఆర్‌ఎస్‌తో ఆయన బంధం పూర్తిగా తెగినట్లయింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాను శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆమోదించారు. ఈటల రాజీనామా లేఖ సమర్పించిన రెండు గంటల వ్యవధిలోనే స్పీకర్ దాన్ని ఆమోదించడం గమనార్హం. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండటంతో ఎలాంటి అడ్డంకులు ఎదురవలేదు. స్పీకర్ ఆమోదంతో హుజురాబాద్ ఉపఎన్నికకు లైన్ క్లియర్ అయింది. అంతకుముందు, శనివారం(జూన్ 12) ఉదయం శామీర్‌పేటలోని తన నివాసం నుంచి అనుచరులు,మద్దతుదారులతో కలిసి ఈటల గన్‌పార్క్‌కి చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… ఉపఎన్నికలో తనదే విజయమన్న ధీమా వ్యక్తం చేశారు. 17 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశానని… విలువలు, నిబద్దతతో కూడిన రాజకీయాలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టానికి తూట్ల పొడుస్తూ కొందరు అధికార పార్టీలో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే పదవి వదులుకుంటూ రాజీనామా లేఖ సమర్పించిన ఈటల.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు ఘోరీ కడతానని ఈ సందర్భంగా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని, కానీ కేసీఆర్‌ మాత్రం నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర వందల కోట్లు ఉన్నాయని,వాటిని గుమ్మరించి హుజురాబాద్‌లో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కురుక్షేత్రమేనన్నారు. అక్కడ గెలిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతానన్నారు. రాజీనామా సమర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ వద్దకు వచ్చిన తనను, మరో నేత ఏనుగు రవీందర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై ఈటల మండిపడ్డారు. కేసీఆర్‌వి వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలని ఈటల విమర్శించారు. కేసీఆర్‌ వాటిని మానుకోవాలన్నారు. అసెంబ్లీ గేట్ వద్ద ఏనుగు రవీందర్‌రెడ్డిని సైతం అనుమతించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తానని రాజీనామా సమర్పించిన అనంతరం ఈటల వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్‌లో జరిగే ధర్మయుద్ధంలో ప్రజల తన వెంటే ఉంటారని… విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇది కౌరవులకు,పాండవులకు మధ్య జరిగే యుద్ధమన్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి,కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతున్న ఉపఎన్నిక అన్నారు. అధికార దుర్వినియోగం ద్వారా ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని… వడ్లు తడిచి మొలకలు వచ్చినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని… యువతకు ఉద్యోగాలు,ఉపాధి లేకుండా పోయాయని అన్నారు. తనకు నిర్బంధాలు కొత్త కాదని… నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు. తనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమ,కేశవరెడ్డి,గండ్ర నళిని బీజేపీలో చేరుతారని తెలిపారు.