కేసీఆర్, మోడీ తీరుపై జగన్ గుర్రు
🔹ఏపీ-తెలంగాణ వార్ పై కేంద్రం అనాసక్తి
🔹జగన్ తాడోపేడో, సుప్రీంతో చెప్పించే యత్నం
అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ పై కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇరు రాష్ట్రాల్లో ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ఇరు రాష్ట్రాలూ నష్టపోతున్నాయి. ముఖ్యంగా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి తాజా వాటర్ వార్ మరింత నష్టదాయకంగా మారుతోంది. ఈ విషయంలో ఇన్నాళ్లూ కేంద్రంతో లాబీయింగ్ కు ప్రయత్నించిన సీఎం జగన్ ఇక తుది పోరుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణను కట్టడి చేసే క్రమంలో తాము నష్టపోయినా ఫర్వాలేదనే ధోరణితో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో సాగుతున్న జల జగడం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నష్టపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ లో అసహనం పెరుగుతోంది. తెలంగాణతో పాటు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతోనే పరిస్ధితి రోజురోజుకూ జటిలంగా మారుతుందని భావిస్తున్న జగన్ దీనిపై మలి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తనకు రాజకీయంగా కూడా ఎంతో కీలకమైన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలతో ముడిపడిన సీమ లిఫ్ట్ వ్యవహారంలో తెలంగాణ వైఖరిని జగన్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇటు కేసీఆర్ తో పాటు చోద్యం చూస్తున్న కేంద్రంపైనా మలి పోరాటం ప్రారంభించబోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో సాగిస్తున్న జల జగడంపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జగన్ సిద్దమవుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలకు హక్కు ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయబోతున్నారు. తెలంగాణ దూకుడును అడ్డుకోవాలని కోరడంతో పాటు మరికొన్ని కీలక అంశాలను కూడా జగన్ సర్కార్ తన పిటిషన్ లో చేర్చబోతోంది. ఇందులో తాను నష్టపోయినా తెలంగాణకు మాత్రం ప్రయోజనం దక్కరాదని భావిస్తోంది. ఏపీ-తెలంగాణకు ఉమ్మడి హక్కులున్న కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వీటిని జాతీయీకరణ చేయాలని సుప్రీంకోర్టును జగన్ కోరబోతున్నారు. తద్వారా ఇరు రాష్ట్రాలు కూడా కేంద్రం చెప్పిన విధంగా వినాల్సిన పరిస్దితి సృష్టించాలనేది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయంగా కేసీఆర్ తో పోలిస్తే బలంగా కనిపిస్తున్న జగన్.. ఇప్పుడు కేంద్రంతో నేరుగా జరిపే లాబీయింగ్ కంటే సుప్రీంకోర్టు ద్వారా ఒత్తిడి పెంచడం ద్వారా తన ప్రయోజనాల్ని సాధించుకోవాలని చూస్తున్నారు. దీంతో ప్రాజెక్టుల జాతీయీకరణను తెరపైకి తెస్తున్నారు.
కృష్ణా నదిపై ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ దూకుడుగా ముందుకెళుతోంది. పోలీసులను పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది. దీన్ని అడ్డుకునేందుకు ఏపీ పోలీసుల్ని కూడా రంగంలోకి దింపితే ఇది అంతర్ రాష్ట్ర శాంతిభద్రతల సమస్యగా మారుతుంది. దీంతో ఏపీ సర్కార్ ఇప్పుడు కేంద్ర బలగాల రక్షణ కోరుతోంది. అయితే కేంద్రం దీనిపై స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ద్వారా బలగాల రక్షణ కోరబోతోంది. తద్వారా తెలంగాణ దూకుడుకు అడ్డుకట్ట పడటంతో పాటు ఇరు రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సి వస్తుంది.