కొత్త మెడికల్ కాలేజీలకు కాబినెట్ నిర్ణయం
🔹తెలంగాణలో మరో 7 చోట్ల కొత్త మెడికల్ కాలేజీలు
🔹తీర్మానించిన తెలంగాణ కేబినెట్
🔹ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో మరో 7 చోట్ల మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కాలేజీలన్నీ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాక ముందు ఇక్కడ కేవలం నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. తాజాగా మరో 7 కాలేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. దీంతో మొత్తం సంఖ్య 16కు చేరనుంది.మరోవైపు, వ్యాక్సినేషన్ విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జర్నలిస్టులు, వ్యాపారులకు టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై మంత్రివర్గం చర్చించింది. కరోనా వ్యాప్తి తీరు, బాధితులకు అందుతున్నవైద్యం, నియంత్రణ కోసం వైద్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నదని వైద్యశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ్ పేట్, మక్తల్ ,నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీ తోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని, సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలని, సంబంధిత నియంత్రిత ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్థుతం జైలు వున్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్థుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేయాలని తర్వాతి కేబినెట్ కు తీసుకురావాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.రైతు బంధు ఆర్ధిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులకు అందించాలని, యాసంగిలో జమ చేసిన విదంగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలను జమ చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.