KTR

 

కొత్త రేషన్ కార్డుల జారీపై కేటీఆర్ ప్రకటన

 

సిరిసిల్ల (ప్రశ్న న్యూస్) తెలంగాణలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌ని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆస‌రా పెన్షన్లను పది రెట్లు పెంచామని అన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు స్ఫూర్తితోనే కేంద్రం పీఎం కిసాన్ పథకాన్న అమలు చేస్తోందని కేటీఆర్ తెలిపారు.అంతకుముందు రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రైస్ మిల్లులు ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చేలా నూతన పాలసీ రూపొందించాలని గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,15,901 రేషన్ కార్డు దరఖాస్తులు విచారణ తుదిదశకు చేరుకుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వారందరీకి త్వరగా కార్డులు ఇచ్చి ఒకేసారి రేషన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ధృవీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. కొత్త కార్డుల వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడినా రెడీగా ఉన్నామని తెలిపారు.