కొలీజియం సిఫార్సులపై ఊహాగానాలా.?
మీడియా కథనాలపై సీజే ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) సుప్రీంకోర్టులో తాజాగా న్యాయమూర్తుల రిటైర్మెంట్ల నేపథ్యంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు వీలుగా సమావేశమైన కొలీజియం పలు సిఫార్సులు చేసింది. ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే దానిపై మీడియాలో పలు కథనాలు వెలువడ్జాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం ఇచ్చిన పేర్లపై వచ్చిన ఊహాజనిత మీడియా కథనాలు బాధ్యతా రాహిత్యమైనవని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఊహాగానాలతో సుప్రీంకోర్టుకు రావాలని ఎదురుచూస్తున్న పలువురు న్యాయమూర్తులపై ప్రభావం పడుతుందని రమణ తెలిపారు. న్యాయమూర్తుల నియామకం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి కథనాలు ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేసేందుకు కొలీజియం సమావేశాలు ఇంకా జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో అరకొర సమాచారంతో వార్తలు రావడంపై సీజేఐ రమణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రక్రియకు ఓ గౌరవం ఉందని, కానీ మీడియా ఇచ్చే అసమగ్ర కథనాలతో దీని గౌరవం మంటగలుస్తోందని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాత్రం మీడియా స్వేచ్ఛను, వ్యక్తుల స్వేచ్ఛను గౌరవిస్తామని సీజే రమణ వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో పలువురు సీనియర్ జర్నలిస్టులతో పాటు మీడియా సంస్ధలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా సీజే రమణ గుర్తు చేశారు. అలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులు, నైతిక విలువలు కలిగిన మీడియా ప్రస్తుత ప్రజాస్వామ్యానికి బలంగా ఆయన అభివర్ణించారు. మీరంతా వ్యవస్ధలో భాగస్వాములే. కాబట్టి అత్యున్నత న్యాయస్ధానం గౌరవాన్నీ, ప్రతిష్టనూ కాపాడవలసిందిగా కోరుతున్నానంటూ రమణ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం కొన్ని పేర్లు ఖరారు చేసిందంటూ వివరాలు బయటికి వెలువడ్డాయి. వీరిలో పలువురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. దేశానికి తొలి మహిళా సీజే రాబోతున్నారంటూ కూడా ఈ కథనాలు పేర్కొన్నాయి. వీటిపై దేశవ్యాప్తంగా భిన్న స్పందన వస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా పేర్లను ఖరారు చేయకముందే ఇలాంటి కథనాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమనే వాదన వినిపిస్తోంది.