కొవొవాక్స్ వాడకానికి సీరం దరఖాస్తు
త్వరలో పిల్లలకూ వ్యాక్సిన్
షా, మాండవీయతో పూనావాలా భేటీ
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) భారత్ లో కరోనా మహమ్మారిపై పోరు నిదానంగా సాగుతోన్న వేళ, మరో వ్యాక్సిన్ అనుమతి కోసం దరఖాస్తు దాఖలైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత నోవావాక్స్ సంస్థ తయారుచేసిన కొవొవాక్స్ టీకాను భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ ఆ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా-ఎస్ఎస్ఐ’ శుక్రవారం నాడు దరఖాస్తు చేసుకుంది. మరోవైపు, ఇదే సీరం సంస్థ.. కొవావాక్స్ వారి చిన్నపిల్లల టీకాపైనా క్లారిటీ ఇచ్చింది. సీరం సీఈవో అధర్ పూనావాలా ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయను ఢిల్లీలో కలిశారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ కంపెనీ తయారుచేసిన కొవొవాక్స్ టీకా (ఎన్‌వీఎక్స్ కొవ్ 2373) ఉత్పత్తిని సీరం సంస్థ చేపట్టింది. క్లినికల్ ట్రయల్స్ లో దీని సమర్థత 90.4శాతంగా తేలింది. కొత్తగా ఏర్పడిన పలు వేరియంట్ల (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (డెల్టా వేరియంట్ వంటివి), వేరియంట్స్ ఆఫ్ ఇంట్రె్‌స్ట)పై తమ టీకా ఎఫికసీ 93.2% ఉన్నట్టు నోవావాక్స్ కంపెనీ పేర్కొంది.
వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలోకి రాని మిగతా వేరియంట్లన్నింటిపైనా 100% ప్రభావశీలత చూపిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే.. హైరిస్క్ గ్రూపు, అంటే 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై 91% ఎఫికసీ ఉన్నట్టు తెలిపింది. అమెరికా, మెక్సికో దేశాల్లోని 119 చోట్ల.. 29,960 మందిపై ఈ టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో 77 మందికి కరోనా వచ్చింది. ఆ 77 మందిలో 63 మంది ప్లాసిబో (సెలైన్ వాటర్ మాత్రమే) తీసుకున్నవారు కాగా.. 14 మంది మాత్రం నోవావాక్స్ టీకా తీసుకున్నవారు. ప్లాసిబో తీసుకున్న 63 మందిలో 10 మందికి మోడరేట్ (కొద్దిపాటి) లక్షణాలు కనపడగా.. నలుగురికి ఇన్ఫెక్షన్ తీవ్రతరమైంది(సివియర్). వ్యాక్సిన్ తీసుకున్న 14 మందిలో ఎవరికీ ఇన్ఫెక్షన్ తీవ్రత మోడరేట్, సివియర్ దశకు చేరలేదు. స్వల్ప లక్షణాలతోనే తగ్గిపోయింది. కాబట్టి, తమ టీకా వేసుకున్నవారికి ఇన్ఫెక్షన్ తీవ్రత మోడరేట్ (కొద్దిపాటి), సివియర్ (తీవ్ర)స్థాయికి వెళ్లకుండా 100% రక్షణ ఉంటుందని నోవావాక్స్ కంపెనీ ప్రకటించింది. కాగా.. ఈ టీకా ను ఫ్రిజ్‌లో (2-8 డిగ్రీల సెల్సియస్) భద్రపరిస్తే చాలు. మోడెర్నా, ఫైజర్ టీకాల్లాగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రపరచక్కర్లేదు. కాగా.. తమ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకోనున్నట్టు నోవావాక్స్ తెలి పింది. సెప్టెంబరు చివరినాటికి నెలకు 10 కోట్ల డోసులు, ఈ ఏడాది చివరికి నెలకు 15 కోట్ల డోసుల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 77 మంది వైరస్ బారిన పడగా.. వారిలో 54 మంది నుంచి నమూనాలను తీసుకుని జన్యుక్రమావిష్కరణ చేశారు. వాటిలో 35 కేసులు వేరియంట్ ఆఫ్ కన్సర్న్, 9 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రకాలకు చెందినవని, 10 కేసులు ఈ రెండు కేటగిరీల్లోకి రాని మామూలు వేరియంట్లవని తేలింది. మొత్తం 54 కేసుల్లో 82కు పై రెండు రకాలకు చెందినవే. వీటిలో కూడా ప్లాసిబో గ్రూపువారిలో ఈ తరహా కేసులు 38 రాగా.. టీకా తీసుకున్నవారిలో ఆరుగురికి ఈ వైర్‌సలు ఇన్ఫెక్షన్ కలిగించగలిగాయి.
ఇదిలా ఉంటే, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయలను కలిశారు. సీరం సంస్థ కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవీషీల్డ్ టీకాల సరఫరా గురించి సంస్థ సీఈవోతో మంత్రి మాట్లాడారు. కోవిడ్19 నిర్మూలనలో సీరం సంస్థ చేస్తున్న కృష్టిని మంత్రి అభినందించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు నిరంతరంగా ఆ కంపెనీకి సపోర్ట్ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇవాళ ఉదయం బయోలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమ ధాట్ల మంత్రిని కలిసిన విషయం తెలిసిందే. కోర్బోవ్యాక్స్ టీకాల గురించి ఆ ఇద్దరూ చర్చించారు. అమిత్ షాతో భేటీ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. కొవిడ్ టీకాల ఉత్పత్తికి సంబంధించి సీరం సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోందని ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్నదని, నరేంద్ర మోదీ సర్కార్ సహకారం వల్లే సీరం నిలదొక్కుకోగలిగిందని చెప్పారు. ఇక కొవావాక్స్ పిల్లల వ్యాక్సిన్ గురించి కూడా పూనావాలా క్లారిటీ ఇచ్చారు. నోవావాక్స్ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయత్నాలు చేస్తోందని పూనావాలా చెప్పారు. జులైలో క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. కరోనా నివారణలో తమ టీకా 90.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్లనూ అడ్డుకోగలదని అమెరికాకు చెందిన నోవావాక్స్ కంపెనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న ‘సీరమ్’ సెప్టెంబర్ కల్లా భారత్‌లో ఈ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, అలాగే జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్, 2021కు ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు. లోకమాన్య తిలక్ ట్రస్ట్ ప్రెసిడెంట్ దీపక్ తిలక్ ఈ వివరాలను ప్రకటించారు. దీపక్ తిలక్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో డాక్టర్ సైరస్ పూనావాలా విశేషంగా కృషి చేశారని చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ద్వారా ఆయన అనేక మంది ప్రాణాలను కాపాడటానికి సాయపడ్డారన్నారు. ఆయన నాయకత్వంలో కోట్లాది కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రికార్డు సమయంలో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయన్నారు. రకరకాల వ్యాక్సిన్లను అందుబాటు ధరలకు తయారు చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. ఆగస్టు 13న జరిగే కార్యక్రమంలో డాక్టర్ పూనావాలాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ పురస్కారంతోపాటు రూ.1 లక్ష నగదు, ఓ మెమెంటో ప్రదానం చేస్తామన్నారు. ఇదిలా ఉంటే, యూకేతో పాటు ఇతర దేశాల్లో కరోనా రూల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల కోసం కెటోతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అన్‌లాక్ ఎడ్యుకేషన్ పేరిట ఫండ్ రైజింగ్ చేస్తున్న క్రమంలో సాయం చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా ముందుకొచ్చారు. తాను రూ.10కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు. అర్హులైన విద్యార్థులకు క్వారంటైన్ ఖర్చుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా లోన్లు, స్కాలర్‌షిప్స్‌తో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. యూకేలో చాలా మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న క్రమంలోనే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధర్ పూనావాలా ఈ నిర్ణయం తీసుకున్నారు.