Revanth

 

కోకాపేట భూముల్లో భారీ కుంభకోణం.. బయటపెడతన్నన రేవంత్ రెడ్డి

 

🔹రూ.వెయ్యి కోట్ల కుంభకోణం
🔹పారిపోడానికి సిద్దంగా బినీమీలు
🔹చంద్రబాబు తరహాలో కేసీఆర్ నిఘా

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు కేంద్రంలోని మోదీని, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్‌ను ఒకేసారి టార్గెట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి రేవంత్ రెడ్డి. పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం నాడు రాజ్‌భవన్ ను ముట్టడించడం, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగిన తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల వేలం, పోలీస్ శాఖలో, ప్రభుత్వ యంత్రాంగంలో కేసీఆర్ బంధుగణం ప్రమేయం తదితర అంశాలపై అనూహ్య ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన భూముల వేలం ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ1000కోట్ల విలువైన ఈ భూ భాగోతం వెనక సీఎం కేసీఆర్ బినామీలు, టీఆర్ఎస్ నేతలే ఉన్నారన్నారని చెప్పారు. ఎకరా రూ.60 కోట్లు పలకాల్సిన భూమికి ప్రభుత్వం ప్రాథమిక ధరను రూ.25 కోట్లుగా నిర్ధారించడం, యావరేజ్ గా భూముల్ని రూ.30 కోట్లకే దోచేశారని రేవంత్ తెలిపారు. అసలు టెండర్లు వేయకుండా కొంత మందిని మేనేజ్‌ చేశారని, కేసీఆర్‌ తన బినామీలు, పార్టీ వారి కోసమే మేనేజ్‌ చేశారని పీసీసీ చీఫ్ ఆరోపించారు.

కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రావాల్సిన చోట రూ.2వేల కోట్లే వచ్చాయని, ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ ఎలా చేశారు? అందుకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా నేడు బయటపెడతానని రేవంత్‌ ప్రకటించారు. భూముల వేలంలో పాల్గొన్న కంపెనీలతో సీఎం కేసీఆర్‌ లావాదేవీలనూ బయటపెడతానన్నారు. రిటైరైన కేసీఆర్ బంధువులు కొందరు విదేశీ పాస్‌పోర్టులు తెచ్చుకుంటున్నారని, రాష్ట్రంలో దోచుకుని విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ చెప్పారు. అవినీతికి పాల్పడకపోతే విదేశాలకు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అలాంటివారి వివరాలనూ బయటపెడతామన్నారు. విదేశీ పాస్‌పోర్టులు తీసుకున్న బంధువుల లెక్కను సీఎం చెప్పాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. అలాగే, ఆ మధ్య ఏపీలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఇజ్రాయెల్ నిఘా పరికరాల వ్యవహారంలో చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ ఉదంతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పదవి కోల్పోవడం తెలిసిందే. సరిగ్గా అలాంటి వ్యవహారమే ఇప్పుడు తెలంగాణలో సాగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఐజీ ప్రభాకర్‌రావు అన్ని పార్టీల నేతల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తున్నారు. ఇజ్రాయెల్‌ సాంకేతికత తెప్పించి మరీ హ్యాక్‌ చేయిస్తున్నారు. తీవ్రవాదుల జాడ కోసం తెచ్చిన సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ప్రైవేటు సైన్యాన్ని నడిపిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. కేసీఆర్‌ బంధువులైన ఎస్పీలు నర్సింగరావు, రాఘవేంద్రరావు ఐజీకి సహకరిస్తున్నారు. రిటైరైన కేసీఆర్‌ బంధువులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు” అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.