covaxin

 

కోవాగ్జిన్-కోవిషీల్డ్ వ్యాక్సిన్ మిక్సింగ్‌తో మెరుగైన ఫలితాలు

 

🔹ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కరోనా మహమ్మారి కొత్త రకాలు భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లపై అనేక రకాల ప్రయోగాలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే సమర్థవంతమైన వ్యాక్సిన్ల మిక్సింగ్ అనేది ప్రాధాన్యాంశంగా మారింది. వేర్వేరు వ్యాక్సిన్లను అందించడం ద్వారా కరోనా మహమ్మారి రకాలను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాల్లో తేల్చారు. ఇప్పటికే ఆస్ట్రాజెనికా, ఫైజర్‌పై బ్రిటన్‌లో అధ్యయనాలు జరుగుతుండగా, భారత్‌లోనూ కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దృష్టి సారించారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను(ఒక్కో డోసు చొప్పున) తీసుకోవడం సురక్షితమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో తేలింది. దీంతోపాటు కరోనాను సమర్థంగా ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయని గుర్తించారు. కాగా, ఈ అధ్యయన నివేదిక అంతర్జాతీయ పరిశోధన పత్రికల్లో సమీక్ష పూర్తి చేసుకోవాల్సి ఉంది.

దేశంలో విస్తృతంగా అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు రెండు వేర్వేరు సాంకేతికతతో అభిద్ది చేశారు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా ఇన్‌యాక్టివేటెడ్ వైరస్‌ను ఉపయోగించి అభివృద్ధి చేయగా, కోవిషీల్డ్ మాత్రం ఎడినో వైరస్ వెక్టార్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలల క్రితం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఒకే వ్యక్తికి రెండు వేర్వేరుగా ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినప్పటికీ దీనిపై ఐసీఎంఆర్ వైద్య నిపుణులు అధ్యయం చేశారు. దీంతో ఒకే వ్యక్తికి వేర్వేరు డోసుల్లో రెండు వ్యాక్సిన్లను తీసుకోవడం సురక్షితమేనని ఈ అధ్యయనం తేల్చింది. అంతేగాక, కరోనావైరస్‌ను నిరోధించే మెరుగైన ఇమ్యూనిటీని కూడా పొందవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ల కొరత వంటి పరిస్థితుల్లో ఇలాంటి మిశ్రమ పద్ధతిలో టీకాలు ఇవ్వడం మరింత ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, జులై 30న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను మిశ్రమ పద్ధతిలో వాడటం, వాటి ఫలితాలను అంచనా వేసేందుకు ఓ అధ్యయనం చేపట్టాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీసీఎస్ఓ) నిపుణుల కమిటీ బృందం సిఫార్సు చేసింది. ప్రస్తుతం దీనిపై అధ్యయనం కొనసాగుతోంది. ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3, 19, 34, 455కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన 491 మంది చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822కి చేరింది. కరోనా వైరస్ తగ్గడంతో 43,910 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వైరస్ కేసుల శాతం 1.27గా ఉంది. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. దేశంలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50.68 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 55,91,657 మంది టీకా తీసుకున్నారు. కాగా, వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది.