Jg

కోవిడ్ తో కాపురం చేయాల్సిందే – సీఎం జగన్

 

🔹ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
🔹స్పష్టం చేసిన సీఎం

 

ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే సడలింపులు మాత్రం ప్రకటించాల్సి ఉందన్నారు. మరోవైపు కరోనా అన్నది ఎప్పటికీ జీరో కాదని.. కలిసి కాపురం చేయక తప్పదని మరోసారి స్పష్టం చేశారు.

అమరావతి (ప్రశ్న న్యూస్) కరోనా నియంత్రణలో తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయ అన్నారు సీఎం జగన్. ముఖ్యంగా కలెక్టర్లు అద్భుతమైన పనితీరు కనబర్చారంటూ కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. అందుకే ఊహించిన స్థాయిలో కేసులు తగ్గాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. అందుకే ఈనెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేశారు సీఎం జగన్. కోవిడ్‌ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని స్పష్టం చేశారు. మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కరోనాతో కలిసి కాపురం చేయాల్సిందే అన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలన్నారు. ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు. ఫోకస్‌గా టెస్టులు చేయాలని, గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగించాలన్నారు. ఎవరు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు.

కోవిడ్ పరీక్షలు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి మాత్రమే చేయాలన్నారు. ఎవరైనా కోవిడ్‌పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలన్నారు. అన్ని టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నాన్నారు. 89శాతం మంది కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారని. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారని అభినందించారు.వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదని… ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దన్నారు. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలి. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి. రెండోసారి చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్‌ చేసుకోవాలి. కోవిడ్‌ సంబంధిత అంశాలకు 104 అనేది వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కావాలన్నారు. కలెక్టర్లు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. కేసులు తగ్గినప్పుడు కాస్త రిలాక్స్‌ మూడ్‌వస్తుంది. ఇలాంటి సమయంలో ఒకసారి మొత్తం సమీక్షించుకుని తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 439 ఆస్పత్రులు ప్రస్తుతం ఆపరేట్‌ చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఆస్పత్రుల్లో సూపర్‌ విజన్, పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యమని అధికారులకు ఆదేశించారు.

వారానికి ఒకసారి ఫీవర్‌క్లినిక్స్‌ కూడా కచ్చితంగా నిర్వహించాలన్నారు. మనం గుర్తిస్తున్న అంశాలను కూడా ఫాలోఅప్‌ చేయాలన్నారు. అసలు థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదని.. అలా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్లకు సూచించారు సీఎం. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నామని.. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఒకటి తిరుపతిలో ఒకటి తీసుకుని వస్తున్నామన్నారు. దీనికి సంబంధించి అవసరమైన భూములను వెంటనే కలెక్టర్లు గుర్తించాలన్నారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కెపాసిటీ పెంచాలన్నారు. ఆలోగా మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలన్నారు. నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. నిర్ణయించుకున్న విధానాలనుంచి పక్కకు పోవద్దన్నారు. తర, తమ భేదం చూపొద్దని. మనం కరెక్టుగా ఉంటే.. వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయన్నారు. నిర్దేశించుకున్న మార్గదర్శకాలను తప్పక పాటించాలని సూచించారు. మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ఇవ్వాల్సి ఉంటే… ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. మరో 69,0,710 మందికి మాత్రమే ఒకడోసు ఇవ్వగలిగామన్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని.. అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు.