supreme court

 

కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే – సుప్రీం కోర్టు

 

🔹న్యాయమూర్తుల ధర్మాసనం.. కీలక ఆదేశాలు
🔹పరిహారం చెల్లించడానికి గైడ్‌లైన్స్.. ఆరువారాల గడువు

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన విధ్వంసానికి లక్షలాది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడకలు చాలక మృత్యువాత పడ్డారు. ఒక దశలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలకు పైగా నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు అదే సంఖ్య కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే- నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా మరణాల వేగం తగ్గింది. అయినప్పటికీ- ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. రోజూ వెయ్యికి కాస్త అటు ఇటుగా మరణాలు నమోదవుతోన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా- కరోనా బారిన పడి అన్ని విధాలుగా నష్టపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని గానీ, ఆర్థిక సహాయాన్ని గానీ అందజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ మేరకు పరిహారాన్ని చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ పిటీషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన వాదలను ముగించింది. కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది.

దేశంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైన నష్ట పరిహారం, ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలని సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ దిశగా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. మార్గదర్శకాలను రూపొందించడానికి డెడ్‌లైన్ కూడా పెట్టింది. ఆరు వారాల్లోగా వాటిని ఫ్రేమ్ చేయాలని పేర్కొంది. కరోనా బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల రూపాయల మేర నష్ట పరిహారాన్ని చెల్లించలేమంటూ కేంద్రం చేసిన వాదనలను కొట్టి పారేసింది. కేంద్రం ఇదవరకే దాఖలు చేసిన అఫిడవిట్‌ను తిరస్కరించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్డీఏఎం) కింద పరిహారాన్ని చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని చెల్లించలేకపోతే- ఎన్డీఎంఏ తన చట్టబద్దమైన బాధ్యతల నుంచి తప్పుకొనట్టుగా భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆరు వారాల్లోగా ప్రతి కోవిడ్ మృతుడి కుటుంబానికీ పరిహారం చెల్లించేలా తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించింది. కరోనా మరణాల విషయంలో కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచిన స్మాల్ అండర్ సెక్షన్ 12 అనే పదాన్ని.. షల్ అండర్ సెక్షన్ 12గా మార్చాలని కూడా ఆదేశించింది.

కేంద్రం వాదనేంటీ?

కరోనా వల్ల మరణించిన వారి కుటుంబాలకు తాము నష్ట పరిహారం చెల్లించలేమంటూ ఇదివరకే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అలాంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి అనేక పథకాలను తెచ్చామని తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులకు పరిహారాన్ని చెల్లించడానికి ఉద్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలు- కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం పరిధిలోకి రావని కుండబద్దలు కొట్టింది. కరోనా సృష్టించిన సంక్షోభం.. భూకంపాలు, వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల కిందికి రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 183 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.