కోవిడ్ వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) కరోనా కొత్త వేరియంట్ల కట్టడికి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్.రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కాలం గడుస్తున్న కొద్దీ రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది కాబట్టి బూస్టర్ డోసులు అవసరమని ఆయన చెబుతున్నారు. భారతదేశంలో ఉద్భవించిన డెల్టా వేరియంట్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి విధితమే. ఈ వేరియంట్ ఇప్పటికే కోవిడ్ -19 టీకా తీసుకున్నవారికి కూడా సోకింది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వైరస్‌లు విజృంభించకుండా ఉండాలి అంటే బూస్టర్ డోసులు అవసరమని గులేరియా అభిప్రాయపడ్డారు. “రోగనిరోధక శక్తిని పెంచి, అన్ని రకాల కరోనా వైరస్‌లను సమర్థవంతంగా అడ్డుకోగల రెండో తరం టీకాలను తీసుకొస్తున్నాం. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు కూడా ప్రారంభమయ్యాయి. 2021 నాటికి బూస్టర్ డోసులు భారతదేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బూస్టర్ డోసులు పంపిణీ చేయాలంటే మొదటగా దేశ ప్రజలందరికీ టీకాలు వేయాలి. ఆ తర్వాతనే బూస్టర్ డోసుల పంపిణీ మొదలవుతుంది” అని డాక్టర్. రణ్‌దీప్ గులేరియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు ఇచ్చే టీకాల గురించి కూడా మాట్లాడారు. 2021 సెప్టెంబరులోపు భారతదేశంలోని చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్ వంటి అందుబాటులో ఉన్న టీకాలతో చిన్నారులపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సెప్టెంబర్ నాటికి చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వస్తే.. దశలవారీగా పాఠశాలలు తెరిచేందుకు కూడా వీలు ఉంటుందన్నారు. భారతదేశంలో ఒకటి లేదా రెండు టీకా డోసులు తీసుకున్న తర్వాత కూడా చాలామంది వైరస్ బారిన పడినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. రెండు టీకా డోసులు తీసుకున్నా వైరస్ సంక్రమిస్తుందని స్పష్టమవుతోంది. అందుకే కొవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. బూస్టర్ డోసులు తయారు చేసేందుకు కూడా నడుం బిగించింది. ఇందుకోసం ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందింది. ఈ బూస్టర్ డోసులపై ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభం కాగా నవంబర్ నాటికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అమెరికాలో కూడా ఫైజర్, బయోఎంటెక్ కలిసి డెల్టా వేరియంట్‌ను అరికట్టేందుకు కోవిడ్ -19 బూస్టర్ డోసులను అభివృద్ధి చేస్తున్నాయి.