lamba virus

కోవిడ్-19: డెల్టా, డెల్టా ప్లస్, లామ్డా వేరియంట్లు అంటే ఏమిటి…?

ఇవి వ్యాక్సీన్లకు లొంగుతాయా?

జె.సతీష్, పరిశోధన పాత్రికేయులు (ప్రశ్న న్యూస్) భారత్ మరో కోవిడ్-19 వేరియంట్‌ను ఆందోళనకరమైన రకంగా గుర్తించింది. దీన్ని మొట్టమొదట యూరప్‌లో గుర్తించారు. సులభంగా సోకడం, తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించడం, యాంటీబాడీలతో అదుపు చేయడం కష్టమవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌కి ఉన్నట్లు అధ్యయనంలో బయటపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ కొత్త వేరియంట్‌కు డెల్టా ప్లస్‌, ఏవై1 అనే పేర్లతో పిలుస్తున్నారు. ఇది చాలా తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని, ఊపిరితిత్తుల కణాలకు ఇట్టే అతుక్కుని దాడి చేస్తుందని, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి లొంగదని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి. భారత్‌లో ప్రాణాంతకంగా పరిణమించి సెకండ్ వేవ్‌కి కారణమని భావిస్తున్న డెల్టా వేరియంట్‌కి ఈ కొత్త డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధం ఉంది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని 6 జిల్లాల నుంచి సేకరించిన శాంపిళ్లలోని 22 శాంపిళ్లలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఏప్రిల్‌లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ 22లో 16 శాంపిళ్లు మహారాష్ట్రవే. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, రష్యా, చైనాల్లోనూ కనిపించింది.

అసలు వేరియంట్ అంటే ఏమిటి?

వైరస్‌లు నిత్యం మ్యుటేట్ అవుతూనే ఉంటాయి. కొన్ని మార్పులు స్వయంగా ఆ వైరస్‌కు కూడా హాని చేసేలా ఉండొచ్చు. ఇలాంటి మ్యుటేషన్లలో కొన్ని ఆ వైరస్ వల్ల కలిగే వ్యాధిని మరింత ప్రాణాంతకంగా మార్చడం, సంక్రమణ శక్తిని పెంచడం చేస్తాయి. ఇలాంటి ప్రమాదకర మ్యుటేషన్ల అనంతరం వ్యాప్తి చెందుతున్న వైరస్‌ను కొత్త వేరియంట్‌గా పిలుస్తారు.

virus variant
కొత్త వేరియంట్ల వ్యాప్తి ఎలా ఉంది?భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణం ఈ డెల్టా వేరియంటేనని పరిశోధనలు చెబుతున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో భారత్‌లో కొన్ని రోజుల్లో రోజుకు నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. జనవరి, మార్చి మధ్యలో మహారాష్ట్రలో సేకరించిన 361 కోవిడ్ శాంపిళ్లలో 220 శాంపిళ్లలో మొదట ఈ వేరియంట్‌ను గుర్తించారు. బ్రిటన్‌లో ఫిబ్రవరి 22 తరువాత ఇలాంటివి 103 కేసులు గుర్తించారు. దీంతో భారత్ నుంచి యూకేకు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు.డెల్టా, డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరమా?ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో విరుచుకుపడిన డెల్టా వేరియంట్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఈ డెల్టా వేరియంట్‌లోని కొన్ని మ్యుటేషన్లకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లతో పోలిక ఉందని లూసియానా స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ జెరెమీ కామిల్ అన్నారు. రోగ నిరోధక శక్తిలోని యాంటీబాడీలను తప్పించుకుని మనిషి శరీరంలోకి ప్రవేశించేలా ఈ మ్యుటేషన్ వైరస్‌కు తోడ్పడగలదని కామిల్ అభిప్రాయపడ్డారు. ”కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్, కిందటి ఏడాది తొలిసారిగా భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్ బంధువే’’ అని ఆయన చెప్పారు. ప్రధానంగా డెల్టా వేరియంట్ వల్లే రెండో దశ తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని కొత్త రకాలు పుట్టుకు రావొచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మొదట్లో విజృంభించిన ఆల్ఫా వేరియంట్ స్థానాన్ని ఈ డెల్టా వేరియంట్ భర్తీ చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా వెల్లడించింది. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని “వేరియంట్ ఆఫ్ కన్సర్న్”గా ప్రకటించింది. అయితే, డెల్టా ప్లస్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ కేటగిరీలో చేర్చడాన్ని వైరాలజిస్టులు కొందరు ప్రశ్నిస్తున్నారు. డెల్టా ప్లస్ మరింత ప్రమాదకరం అనడానికి ఆధారంగా ఇంకా తగినంత డాటా అందుబాటులో లేదని వారు వాదిస్తున్నారు. ”22 డాటా సీక్వెన్స్‌ల ఆధారంగా దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా చెప్పలేం” అని వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ అన్నారు. ”వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా దీన్ని పరిగణించాలంటే మరింత క్లినికల్, బయలాజికల్ సమాచారం అవసరం” అన్నారామె.లామ్డా వేరియంట్ కూడా..బ్రిటన్‌లో మరో కొత్త వేరియంట్ వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీన్ని లామ్డా వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ ఆగస్టు 2020లో దక్షిణ అమెరికా దేశం పెరూలో తొలిసారి కనిపించింది. దీన్ని సీ.37 అని కూడా పిలుస్తున్నారు. ఏప్రిల్ నుంచి పెరూలో నమోదైన కేసుల్లో 81 శాతం కేసులు ఈ వేరియంట్ వల్లే వచ్చాయి. బ్రిటన్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు ఆరు వెలుగులోకి వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ ఆరుగురూ విదేశాలకు వెళ్లినవారేనని తెలిపింది. ప్రస్తుతం పెరూ, బ్రిటన్‌లతోపాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపాల్లో మొత్తం 29 దేశాల్లో లామ్డా వేరియంట్ వ్యాపిస్తోంది. స్పైక్ ప్రోటీన్‌లో భిన్న మ్యుటేషన్లు జరగడంతో ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే, వ్యాప్తి తీవ్రతపై అంచనా వేసేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరమని సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటివరకు భారత్‌లో లామ్డా వేరియంట్ కేసులు వెలుగులోకి రాలేదు. అయితే, విదేశీ ప్రయాణీకుల రాకపోకలతో ఈ వేరియంట్‌ భారత్‌లో చెలరేగే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సీన్లు పనిచేస్తాయా.?

వ్యాధి తీవ్రత తగ్గించే విషయంలో డెల్టా వేరియంట్‌పైనా ప్రస్తుత వ్యాక్సీన్లు పనిచేస్తాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ రవి గుప్తా చెబుతున్నారు. ప్రొఫెసర్ గుప్తా బృందం నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం కొన్ని వేరియంట్లు వ్యాక్సీన్లను కూడా తప్పించుకోగలవు.. అలాంటి పరిస్థితిని నివారించడానికి వ్యాక్సీన్ డిజైన్ కూడా మార్చి మరింత సమర్థంగా తయారుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తి వేగాన్ని అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా చనిపోయే పరిస్థితులు కంటే తక్కువ తీవ్రతతో వ్యాధి రావడమో, అసలు రాకపోవడమో జరగడం కొంత నయమని.. వ్యాక్సీన్ వల్ల అది సాధ్యమని చాలామంది అనుకుంటున్నారని డాక్టర్ కామిల్ చెప్పారు. ”కచ్చితమైన వ్యాక్సీన్ కోసం నిరీక్షించి సమయం వృథా చేసుకోవడం కంటే అందుబాటులో ఉన్న వ్యాక్సీన్ వేయించుకోవడం మంచిది” అని లూసియానా స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ జెరెమీ కామిల్ అన్నారు.

భారత్‌లో థర్డ్ వేవ్ వచ్చే ముప్పుందా.?

 
డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని చెప్పడానికి తగినంత డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు. కానీ, వారాల తేడాతోనే పరిస్థితి మారిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. “వైరస్ వ్యాప్తి ఉన్నంతకాలం కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. ప్రమాదకరమైన కొత్త రకాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలుపరిచే విధంగా మన ప్రయత్నాలను మరింత పెంచాలి” అని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ లలిత్ కాంత్ అన్నారు. జూన్ వరకు ఇండియా 30,000 శాంపిల్స్‌ను పరీక్షించింది. ఇది చాలదని, ఇంకా భారీగా సీక్వెన్సింగ్ చేయాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సీన్లు మనకు తెలిసిన వేరియంట్లపై బాగానే పని చేస్తున్నాయి. కానీ, కొత్త వేరియంట్లపై పని చేస్తాయా, లేదా అనేది కచ్చితంగా తెలీదని అనేకమంది కోవిడ్ రోగులకు వైద్యం అందించిన డాక్టర్ ఫతాహుదీన్ అంటున్నారు. వ్యాక్సీన్ వేసుకున్న తరువాత కూడా కోవిడ్ బారిన పడిన ఉన్నారు. ముఖ్యంగా మొదటి డోసు వేసుకున్న తరువాత కోవిడ్ సోకినవారు ఎక్కువే. “థర్డ్ వేవ్ కచ్చితంగా వస్తుంది. కానీ, కొత్త ఉత్పరివర్తనాలను వెంటనే గుర్తించేందుకు భారీగా శాంపిల్స్ పరీక్షించడం, కఠినమైన నిబంధనలు అమలుచేయడం ద్వారా మూడో దశ రాకను ఆలస్యం చేయవచ్చు. వచ్చినా సులువుగా ఎదుర్కోవచ్చు. ఇవన్నీ చేయకపోతే మనం కన్ను మూసి తెరిచే లోపల థర్డ్ వేవ్ మనల్ని ముంచేస్తుంది” అని ఆయన అన్నారు.