క్యాట్ వాక్.. కేటీఆర్ వాక్ ఒక్కటే – రేవంత్ రెడ్డి
🔹ఆయన్ను మూసీలో ముంచాలి
🔹కేటీఆర్ ను ఎద్దేవా చేసిన రేవంత్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) పీసీసీ చీఫ్ పదవీ వరించాక.. రేవంత్ రెడ్డి తన దూకుడు మరింత పెంచారు. తండ్రి కొడుకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదివరకు కూడా ఫైర్ అయ్యేవారు.. ఇప్పుడు చేస్తోన్న విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. హైదరాబాద్‌కు తండ్రీ కొడుకులు ఏమీ చేయలేదని చెప్పారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని చెప్పారు. మెట్రో నగరాన్ని ఆగం ఆగం చేశారని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన నివాసయోగ్య నగరాల్లో చోటు దక్కలేదని గుర్తుచేశారు.ఇటీవల జరిగిన ఘటనను రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సిటీలో చెత్త పేరుకుపోయిందని.. స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ను పిలిచారని గుర్తుచేశారు. చెత్త, నీళ్లు పేరుకుని మురుగునీరు ఉంది. ఆ చెత్తను కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే పోశాడని.. ఇదీ చాలా టీవీ చానెళ్లలో వచ్చిందని చెప్పారు. అలా మంత్రి కేటీఆర్‌కు సన్మానం చేయాలని కామెంట్ చేశారు. లేకుంటే ఆయనకు పేదల సమస్యలు తెలిసే అవకాశం లేదన్నారు. ఎందుకంటే భద్రతా బలగాలతో వచ్చి.. వెళ్లడమే ఆయనకు తెలుసు అని చెప్పారు.
మూసీలో నడుములోతులో కేటీఆర్‌ను దించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఓ నాలుగు గంటలు ఉంచితే ఆయనకు పేదల సమస్యలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. మురికి, వాసనతో ప్రాబ్లం తెలుసుకుంటారని పేర్కొన్నారు. కానీ ఆయన సిటీలో అరగంట పర్యటించి అంతా సేఫ్ అని బిల్డప్ ఇస్తారని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పైకి మాటలు చెప్పి.. కాళ్లం వెళ్ల దీయడమే తప్ప ఈ ఏడేళ్లలో చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. అలాగే ఫ్యాషన్ పరేడ్, కేటీఆర్ వాక్ అని పోల్చారు. సిటీలో అరగంట చుట్టేస్తారని.. ఏం జరిగిందో తెలుసుకోరు అని చెప్పారు. టీవీలలో క్యాట్ వాక్.. పర్యటన సమయంలో కేటీఆర్ ఒక్కటేనని చెప్పారు. సిటీ చెత్తనగరంగా మారిపోయిందని.. అందుకు బాధ్యులు వారేనని చెప్పారు. అప్పట్లో బల్దియా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. కానీ ఎవరికైనా ఇచ్చారా..? నష్టపోయిన వారిని పట్టించుకోరా అని అడిగారు. ఇదీ కేసీఆర్, కేటీఆర్ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక అని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.