revanth

 

క్షణం మిస్ అవకుండా కేసీఆర్ ప్రసంగం విన్నా – రేవంత్ రెడ్డి

 

🔹ఇక ఆయన చచ్చిన పాము
🔹ఇదే చివరి పొలిటికల్ స్పీచ్
🔹ఈ నెల 18 తర్వాత హుజురాబాద్‌పై దండెత్తుతాం
🔹రేవంత్ రెడ్డి సంచలనం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ వస్తే దళితులకు రాజ్యాధికారం ఇస్తానని చెప్పిన కేసీఆర్… ఉద్యమ కాలంలో వారి త్యాగాలను,పోరాటాలను ఒక పాచికగా వాడుకుని వదిలేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నడూ అంబేడ్కర్, జగ్జీవన్ రామ్‌లకు దండ వేసింది లేదు,దండం పెట్టింది లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,మూడెకరాల భూమి,దళిత గిరిజనులకు ఉద్యోగాల పేరుతో కేసీఆర్ వారిని మోసం చేశారని ఆరోపించారు. ఏడున్నరేళ్ల పాలనలో ఒక్కసారి కూడా దళితులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించలేదన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ కమిటీలను కూడా నియమించలేని దుస్థితిలో పాలన సాగుతోందన్నారు. ప్రజలందరు కలిసి కలుగులో ఉన్న ఎలుకకు పొగ పెడితే అది బయటకొచ్చినట్లు… ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చారని ఎద్దేవా చేశారు.

ఇవాళ హుజురాబాద్‌ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఒక్క క్షణం కూడా మిస్ అవకుండా విన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు అంబేడ్కర్,జగ్జీవన్‌రామ్‌లను చిన్న చూపు చూసినందుకు… కేసీఆర్,ఆయన కుటుంబ ధన దాహానికి బలైపోయిన నేరెళ్ల బిడ్డలను చిత్రహింసలకు గురిచేసినందుకు… ఖమ్మంలో మిర్చి గిట్టుబాటు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేసినందుకు… ఇటీవల మరియమ్మ అనే దళిత మహిళను పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి చంపినందుకు… వీటన్నింటికీ కేసీఆర్ క్షమాపణలు చెప్పి తన ప్రసంగం మొదలుపెడుతాడేమోనని ఆశించినట్లు చెప్పారు. కానీ నరనరాన నమ్మించి మోసం చేసే విధానాన్ని అలవరుచుకున్న కేసీఆర్.. హుజురాబాద్ సభలోనూ మళ్లీ అబద్దాలే చెప్పారని విమర్శించారు. నెక్లెస్ రోడ్‌లో ప్రపంచమే అబ్బురపడేలా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడుతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకూ అక్కడ తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు.

దళిత బంధు సభలో కేసీఆర్ మాటలు విని చాలా జాలి కలిగిందని రేవంత్ అన్నారు. ఈరోజు నుంచి ఆయన చచ్చిన పాములాంటి వాడని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ నీచమైన రాజకీయాలకు ఆయన సతీమణి శోభమ్మకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటిది ఉపఎన్నికలో గెలిచేందుకు శోభమ్మను కూడా తెర పైకి తెచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది కేసీఆర్ స్థాయికి తగదని వ్యాఖ్యానించారు. తాను చేసిన పాపాలను కడుక్కోవడానికే కేసీఆర్ తన సతీమణి ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేశ్ నాయక్, లావణ్య లాంటి విద్యార్థులెందరో ఆత్మబలిదానం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్య చేయించిన నీచపు చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. దళితబంధు పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు.

కేసీఆర్‌కు ఇదే చివరి రాజకీయ ప్రసంగంగా భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. అబద్దాల పునాదుల మీద బీటలు వారుతున్న గులాబీ కోటలను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంబేడ్కర్ పేరు మీద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఏనాడైనా మాట్లాడారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని ఆరోపించారు. చెరువుల్లో మట్టిని అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ ఇవేవీ ప్రజల కోసం కాదన్నారు. కేవలం ప్రజాధనం దోచుకోవడానికే ఈ ప్రాజెక్టులను చేపట్టారని ఆరోపించారు. ఈ ఏడేళ్ల పాలనలో దళిత గిరిజనులకు ఒక్క పైసా దక్కలేదన్నారు. ఒక్క శాసనసభ స్థానం గెలిచేందుకు కేసీఆర్ పూర్తిగా దిగజారిపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దళిత గిరిజనులు విద్య,ఉద్యోగాలకు దూరమయ్యారని ఆరోపించారు. దళిత బంధుపై అసెంబ్లీలో ఒకరోజు చర్చ నిర్వహించి తీర్మానం చేయాలన్నారు. ఆర్నెళ్ల లోపు రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. హుజురాబాద్‌లో త్వరలో తుఫాను రాబోతుందని… అందులో కేసీఆర్ కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ నెల 18న ఇబ్రహీపట్నంలో దళిత,గిరిజన సభ తర్వాత హుజురాబాద్‌పై దండెత్తుతాం అన్నారు. ఇవాళ కేసీఆర్ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ జరుగుతుందన్నారు.