harish rao

 

గాలిని కూడా అమ్ముతారో ఏమో..

 

🔹బీజేపీపై హరీశ్ రావు ఫైర్

 

కరీంనగర్ (ప్రశ్న న్యూస్) బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. దేశ ప్రజలను ఆ పార్టీ వంచిస్తోందని చెప్పారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలతోపాటు అన్నింటినీ అమ్ముతున్న బీజేపీ చివరకు గాలిని కూడా అమ్ముతుందేమోనని అన్నారు. మోడల్ స్కూళ్లను నాశనం చేస్తోంది బీజేపీ, కాపాడింది టిఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన పిఆర్టీయూ కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం అని హరీశ్ రావు అన్నారు. పీఆర్సీని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నా, 7.5 శాతం ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లకే 30 శాతం ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కువ జీతాలు, పీఆర్సీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తేల్చి చెప్పారు.

గతంలో కరెంట్, మంచినీళ్ల గురించి శాసనసభ సమావేశం మొదటి రోజుల్లోనే నిరసన ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్నాయా అని అడిగారు. పక్క రాష్ట్రానికి కరెంట్ అమ్ముతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రోడ్ల వ్యవస్థను మెరుగు పర్చామని తెలిపారు. దేశంలో వరి అత్యధికంగా పండించిన రాష్ట్రంగా తెలంగాణ అని.. పంజాబ్ రాష్ట్రం రెండవ రాష్ట్రంగా మారిందన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన ఘనత తెలంగాణదేనని చెప్పారు. గతంలో తెలంగాణ వృద్ధి 5 శాతం నుండి 9 శాతానికి పోయామని తెలిపారు. దేశంలో తెలంగాణ వృద్ధి మూడవ స్థానంలో ఉందన్నారు. కొత్త జిల్లాలు, ఐటి పార్క్‌లతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈటెల రాజేందర్ ఎందుకోసం రాజీనామా చేశారని ప్రశ్నించారు. వ్యక్తి కోసం ఉంటారా! వ్యవస్థ కోసం ఉంటారా…హుజురాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజేందర్ గెలిస్తే ఆయనకు, బీజేపీకి లాభం, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూరాబాద్‌కు లాభమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, మేధావులు గ్రహించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. పేదలు, సంక్షేమం కోసం పని చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కుట్టు మిషన్లు, కుంకుమ భరణి, బొట్టు బిల్లలు ఇవ్వడం ఈటెల రాజేందర్ ఆత్మ గౌరవం అంటారా అని నిలదీశారు.