KCR & JGN

 

జగన్, కేసీఆర్ కు అగ్నిపరీక్ష

 

🔹తేలుస్తారా, తేలిపోతారా.?
🔹కేంద్రం మొండిపట్టు

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన నేపథ్యంగా తలెత్తిన ఓ కీలక సమస్యగా వ్యవహరించిన తీరుతో ఆ వ్యవహారం కాస్తా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కేంద్రం నుంచి మళ్లీ తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవన్న అంచనాల మధ్య జగన్, కేసీఆర్ కు అగ్నిపరీక్ష ఎదురవుతోంది. ఇందులో వీరు విఫలమైతే మాత్రం భవిష్యత్తులో ఇద్దరినీ తమ సొంత రాష్ట్రాల్లో విపక్షాలు ఆడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇరువురూ ప్రస్తుతం ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి ఏడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఇరు రాష్ట్రాలనూ విభజన కష్టాలు వీడటం లేదు. ఇప్పటికే పలు ఉమ్మడి సంస్ధల విభజన, తరలింపు కూడా పూర్తి కాలేదు. ఉద్యోగుల విభజన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి తరుణంలో ఉన్న సమస్యలు చాలవన్నుట్లుగా తాజాగా మరో కొత్త సమస్యను ఇరు రాష్ట్రాల సీఎంలు తెరపైకి తెచ్చారు. దీంతో ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారం కాస్తా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు జగన్, కేసీఆర్ తలపట్టుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

ఏపీ, తెలంగాణ మధ్య తాజాగా రాయలసీమ లిఫ్ట్ విషయంలో వివాదం తలెత్తింది. దీన్ని ఇరు రాష్ట్రాలు కూర్చుని చర్చించుకుంటే సరిపోయేది. అలా కాకుండా ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తెలంగాణ సర్కార్ ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. దీంతో ఏపీ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. దీంతో కేంద్రం సదరు ప్రాజెక్టుల్ని తమ పరిధిలోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతే కాదు ఈ గెటిట్ ను భవిష్యత్తులో ఎవరూ సవాలు చేయకుండా పార్లమెంటులో బిల్లుల్ని మించి దుర్భేద్యంగా తయారు చేసింది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్టాలు కక్కలేక మింగలేక దిక్కులు చూడాల్సిన పరిస్ధితి. ఏపీ, తెలంగాణ విభజన తర్వాత పలు సమస్యలు ఎదురైనా దేన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోలేదు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాలకు ఇక్కడ టీడీపీ, వైసీపీ అండగా నిలిచాయి. అలాగే తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా కేంద్రంతో నేరుగా వార్ కు సిద్ధపడలేదు. కానీ తాజాగా కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల ఏర్పాటుతో కేంద్రం ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టుల వ్యవహారాన్ని మొత్తంగా తమ పరిధిలోకి తెచ్చేసుకుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, దేనికి అనుమతి కావాలన్నా తిరిగి కేంద్రం వద్ద చేతులు చాచాల్సిన పరిస్దితి ఎదురు కానుంది. దీంతో ఇప్పుడు తిరిగి కేంద్రం నుంచి ఈ వ్యవహారాన్ని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు జగన్, కేసీఆర్ పోరాడాల్సిన పరిస్ధితి వచ్చింది.

ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రివర్ బోర్డుల పరిధిలోకి తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్ని సైతం ఈ కీలక అంశంలో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లయింది. కేంద్రం ఓసారి తమ పరిధిలోకి తెచ్చుకున్న అంశాన్ని తిరిగి రాష్ట్రాలకు అప్పగించాల్సిన అవసరం లేదు. దీంతో ఇప్పుడు జగన్, కేసీఆర్ తిరిగి లాబీయింగ్ లేదా ఉమ్మడి పోరాటం చేసి తిరిగి తమ ప్రయోజనాల్ని సాధించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. కాబట్టి పార్లమెంటు సమావేశాల్లో గెజిట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి పంపారు. కానీ కేంద్రం వీరి పోరాటాల్ని పట్టించుకుంటుందా అంటే గ్యారంటీ లేదు.