జగన్, బీజేపీకి నిజంగానే చెడిందా.?
🔹విడిపోతే జగన్, బీజేపీలో ఎవరికెంత నష్టం?
అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సీఎం వైఎస్ జగన్ సంబంధాలు పెరిగాయి. అంతకుముందు బీజేపీ పెద్దలతో అంటీ ముట్టనట్టుగా ఉన్న జగన్ .. తాను అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రంతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రతీ క్షణం తపించారు. ఇందులో భాగంగానే బీజేపీ అడిగినా, అడకకపోయినా బేషరతుగా పలు కీలక అంశాల్లో పార్లమెంటులో, బయటా మద్దతిచ్చారు. అయినా కేంద్రం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపుతున్న నేపథ్యంలో బీజేపీతో సంబంధాల్ని జగన్ పునస్సమీక్షిస్తున్నారా ? లేక మరి కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఎన్నికల ముందు వరకూ బీజేపీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన వైసీపీ.. ఆ తర్వాత మాత్రం కేంద్రంతో ఉన్న అవసరాల దృష్ట్యా ఎన్డీయే సర్కారుతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలు అడిగిందేదీ కాదనకుండా చేసిపెట్టారు. పార్లమెంటులో, బయటా బేషరతుగా పలు అంశాల్లో మద్దతిచ్చారు. దీంతో ఢిల్లీ పెద్దలు ఏపీలో వైసీపీ సర్కార్ అంటే పరోక్షంగా బీజేపీ సర్కార్ అన్న భావనలోకి వచ్చేశారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలోనే ఏపీకి సైతం నిధులు, ఇతర హామీల విషయాల్లో మొండిచేయి చూపడం సర్వసాధారణంగా మారిపోతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏపీకి గతంలో యూపీఏ సర్కార్ ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో మొండిచేయి చూపుతోంది. గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కాస్తో కూస్తో కేంద్ర విద్యాసంస్ధలు, జాతీయ స్ధాయి సంస్ధల ఏర్పాటు, పోలవరానికి నిధుల విడుదల, రాజధాని అమరావతికి నిధుల్ని విడుదల చేయడం వంటి నిర్ణయాలు తీసుకునేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏపీకి చెప్పుకోదగిన స్ధాయిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దీంతో వైసీపీ ఏ హామీలతో అయితే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఏమీ చేయలేని పరిస్దితి నెలకొంది. దీంతో సహజంగానే వైసీపీ సర్కార్ పై జనంలో ఒత్తిడి పెరగడం, ఆ మేరకు వైసీపీ, బీజేపీ సంబంధాలపై ప్రభావం పడుతున్నాయి. ఏపీకి ఇచ్చిన విభజన హామీలతో పాటు కనీస నిధులు కూడా విడుదల చేయకపోవడం, అప్పులు తెచ్చుకునే విషయంలోనూ ఆంక్షలు విధించడంతో ఇప్పుడు వైసీపీ సర్కార్ పై ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని పలు కీలక అంశాలపై నిలదీస్తున్నారు. ఇది కాస్తా బీజేపీ పెద్దలకు కంటగింపుగా మారుతోంది. అయినా అటు వైసీపీని దూరం చేసుకోలేక, ఇటు వారిపై కఠిన చర్యలకు దిగలేక పార్లమెంటులో వ్యూహాత్మక మౌవాన్ని ఆశ్రయిస్తున్నారు.
కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా, కీలక సమయాల్లో మద్దతిస్తున్నా బీజేపీ పెద్దలు మాత్రం కరుణించకపోవడంతో ఇటు వైసీపీలో అసహనం పెరుగుతోంది. దీంతో వైసీపీ కూడా పునరాలోచనలో పడుతోంది. అయితే ఈ కారణంతో ఇప్పటికిప్పుడు కేంద్రంతో తెగదెంపులు చేసుకునేందుకు వైసీపీ సిద్దంగా లేదు. అటు బీజేపీ కూడా తమకు అడక్కపోయినా అండగా నిలుస్తున్న జగన్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అయినా ఒకవేళ వీరిద్దరూ విడిపోతే ఎవరికి నష్టమన్న చర్చ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో జగన్ అక్రమాస్తుల విచారణ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది ఆరంభానికి ఇది కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జగన్ కు అవసరం తప్పదు. అలాగే ప్రస్తుతం విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో జగన్ వంటి నమ్మకమైన బీజేపీయేతర, కాంగ్రెసేతర మిత్రుడిని దూరం చేసుకుంటే బీజేపీకి భారీ నష్టం తప్పదు.