జగన్ రూటే వేరు
ఎన్ఈపీతో మోడీతో విభేదిస్తూ
ఏపీలో ఆ పాలసీ అమలయ్యేనా ?
అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీలో రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ప్రతీ నిర్ణయంపై తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన దేశమంతా అమలవుతున్న ఓ కీలక విధానంపై కేంద్రంతో విభేదిస్తున్నారు. తాజాగా నిన్న ముఖ్యమంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలోనూ ప్రధాని మోడీ ఈ విధానం ప్రాధాన్యతను గుర్తు చేశారు. అదే సమయంలో మరో సంక్షేమ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ మాత్రం దీంతో విభేదించారు. తాము అనుకున్నదే చేస్తామని కుండబద్దలు కొట్టేశారు. తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్.. పాలనపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కొన్ని ప్రాధాన్యతాంశాలపై మాత్రం విభేదిస్తున్నారు. దేశమంతా అమలవుతున్న విధానాలను సైతం ఏపీలో అమలు చేసేందుకు ఆయన ఇష్టపడటం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా మారుతున్న కాలంలో గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు సైతం యూజర్ల అభిరుచులకు ప్రాధాన్యమిస్తుంటే వైఎస్ జగన్ మాత్రం వాటితో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జాతీయ స్ధాయిలో అమలవుతున్న ఓ పాలసీకి ఏపీలో మాత్రం చుక్కెదురవుతోంది.
పాఠశాల విద్యలో విద్యార్ధులకు ఎలాంటి విద్య లభించాలి, ఎలాంటి భాషలో లభించాలి, విద్యార్ధులు విద్యాభ్యాసాన్ని ఆస్వాదించాలంటే వారికేం కావాలో ఎప్పటికప్పుడు మార్పులుచేర్పులు చేసి జాతీయ విద్యావిధానాలు రూపొందిస్తున్నారు. తాజాగా గతేడాది అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తున్నాయి. అయితే స్ధూలంగా చూస్తే విద్యావిధానం అమలులో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ఎంతో ముందుంది. కరోనాలో సైతం విద్యావిధానం అమలు దిశగా ప్రభుత్వం అడుగులేసింది. కానీ ఓ కీలక అంశం వద్దకు వచ్చేటప్పటికి మాత్రం ససేమిరా అంటోంది. గతేడాది అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాధమిక విద్యను మాతృభాషలో అందించగలిగితే విద్యార్ధులు సులువుగా నేర్చుకుంటారనే ప్రాధాన్యతా అంశాన్ని మరోమారు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని నిన్న సీఎంలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధాని మోడీ కూడా స్పష్టం చేశారు. మాతృభాషలో విద్యావిధానం అమలు చేస్తున్న రాష్ట్రాల్ని ప్రశంసించారు. కొన్ని రాష్ట్రాలైతే మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సులు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఏపీలో మాత్రం పూర్వ ప్రాధమిక విద్య నుంచి మొదలుకుని డిగ్రీ కోర్సుల వరకూ ఇంగ్లీష్ మీడియమే అమలు చేస్తామని నిన్న సీఎం జగన్ తేల్చిచెప్పేశారు. దీంతో దేశమంతా ఓ దారి, జగన్ ది మరోదారి అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది.
గతేడాది జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చాక పలు రాష్ట్రాలు ఇంగ్లీష్ ను కాదని మాతృభాషలోనే ఏకంగా ఇంజనీరింగ్ కోర్సులనే అందించేందుకు ముందుకొచ్చాయి. గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు సైతం మాతృభాషల్లోనే సెర్చింజన్ తో పాటు ఇతర యాప్ లను సైతం అందిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం జాతీయ విద్యావిధానం ప్రకారం మాతృభాష అయిన తెలుగులో విద్యాభ్యాసానికి అవకాశం లేకుండా పోతోంది. ప్రభుత్వం ఇంగ్లీష్ పై చూపుతున్న మక్కువతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు డిగ్రీ కోర్సులు అందిస్తున్న విశ్వవిద్యాలయాల వరకూ దీన్నే అమలు చేసేందుకు ఆదేశాలు ఇస్తోంది.. దీంతో ఏపీలో జాతీయ విద్యావిధానం సంపూర్ణంగా అమలు కావడం కష్టమేనని తెలుస్తోంది.