జగన్ సర్కారుపై హైకోర్టు ఫైర్
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయమూర్తి సంచలన కామెంట్స్
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు తప్పుపట్టింది. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు నలుగురు ఐఏఎస్‌లు హాజరయ్యారు. పంచాయితీ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్వేది, కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టుకు వచ్చారు.ఈ సందర్భంగా పాఠశాలల భవనాల్లో రైతు భరోసా, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారణ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఆ పాఠశాలల ఆవరణలో ఎలాంటి భవనాలు నిర్మించొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించలేదని ఐఏఎస్‌లను ప్రశ్నించింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే పాఠశాలల్లో వాతావరణం కలుషితం చేస్తున్నారని ధర్మాసనం మండిపడింది. హైకోర్టు ఆదేశాలను సరిగా పాటించడం లేదని.. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ‘మీలో ఏవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారా’ అని హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలోకి రాజకీయాలను ఎలా తీసుకెళ్తారని నిలదీశారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీనిపై పూర్తిస్థాయి విచారణను ఆగస్టు 31కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు తెలిపారు.