జగన్, సాయిరెడ్డి బెయిళ్లపై ట్విస్ట్
సీబీఐ కోర్టు నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి.?
సుప్రీం సిగ్నల్ కోసమేన
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పులు ఇవాళ వస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ హైదరాబాద్ సీబీఐ కోర్టు మాత్రం ఈ తీర్పుల్ని వచ్చేనెల 15కు వాయిదా వేసేసింది. దీంతో ఈ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. అయితే సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయం వెనుక ఓ బలమైన కారణం కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్, విజయసాయిరెడ్డిల్ని టార్గెట్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు ఇస్తుందని భావించినా అలా జరగలేదు. చివరి నిమిషంలో ఈ తీర్పుల్ని వచ్చే నెల 15కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో అప్పటివరకూ వేచి చూడాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై చర్చ జరుగుతోంది.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పు కాసేపట్లో వెలువడుతుందని అంతా భావిస్తున్న తరుణంలో సీబీఐ కోర్టు దీన్ని ఏకంగా 20 రోజుల పాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీబీఐ కోర్టు నిర్ణయంతో అప్పటివరకూ తీర్పులు వస్తాయని ఉత్కంఠగా ఎదురుచూసిన వారందరికీ నిరాశ మిగిలింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులతో పాటు కోర్టు దగ్గర ఉన్న న్యాయవాదులు కూడా ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో సీబీఐ కోర్టు నిర్ణయం వెనుక ఏముందనే చర్చ సాగుతోంది. ఇందులో పలు కారణాలను వారు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిళ్ల రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడటానికి కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసుల్లో దర్యాప్తు, విచారణల వేగవంతం, నిందితుల బెయిళ్ల రద్దుపై జరుగుతున్న విచారణ. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) విజయ్ హన్సారియా చేసిన సిఫార్సులు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన సీబీఐ, ఈడీ కేసులతో పాటు అన్ని క్రిమినల్ కేసుల్లోనూ దర్యాప్తుతో పాటు విచారణలు కూడా వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హన్సారియీ పలు సిఫార్సులు చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో దర్యాప్తు పూర్తయి విచారణ ప్రారంభమైతే వాటిపై రోజువారీ విచారణలు జరగాలని కూడా ఆయన సూచించారు. వీటిని పరిశీలించి రేపోమాపో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. దీంతో సీబీఐ కోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వాయిదా నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు, విచారణల విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడాది లోపు ఈ కేసుల్ని తేల్చేయాలని దేశవ్యాప్తంగా హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై స్పందించిన హైకోర్టులు ఇప్పటికే ట్రయల్ కోర్టుల్ని కూడా ఈ ఉత్తర్వుల్ని అమలు చేయాలని పాలనాపరమైన ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులోనూ సీబీఐ కోర్టులో విచారణ వేగంగా సాగుతోంది. తాజాగా ఈడీ కేసుల విచారణ ముందుగా ప్రారంభించేందుకు కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఈ కేసుల విచారణలో ఆలస్యంపై మరోసారి స్పందించి అమికస్ క్యూరీ సిఫార్సులు కోరడం, ఇవి నిన్న సుప్రీంకోర్టును చేరడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ సిఫార్సులపై సుప్రీంకోర్టు తీసుకోబోయే కీలక నిర్ణయం జగన్ అక్రమాస్తుల కేసుల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. సుప్రీం కోర్టు ఈ సిఫార్సుల్ని ఆమోదిస్తే జగన్ కేసుల్లో రోజువారీ విచారణ కూడా జరగనుంది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం సీబీఐ కోర్టుతో పాటు జగన్ కేసుల్లో నిందితులు, ప్రతివాదులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.