జలజగడంపై జోక్యం చేసుకోండి..
🔹ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం జగన్ లేఖలు
అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న జలజగడంపై జోక్యం చేసుకోవాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖలు రాశారు. ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ ఈ మేరకు లేఖలు రాశారు. కృష్ణా జలాల వివాదంపై ప్రధాని, జలశక్తి మంత్రికి వేర్వేరుగా లేఖలు రాసిన సీఎం జగన్.. జలజగడంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్) పరిధిని ఖరారు చేయాలని ప్రధాని, కేంద్రమంత్రికి రాసిన లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఏపీకి సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలంటూ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలు అంతర్రాష్ట సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరుకు కూడా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఎలాంటి వ్యవసాయం అవసరాలు లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందని ఆరోపించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం మరింతగా ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని ఆరోపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. పోలీసలు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చూడాలని కోరింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ వాదనను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. తాజాగా పులిచింతల దగ్గర తెలంగాణ జెన్‌కో అధికారులకు విద్యుత్ ఉత్పత్తి నిలిపేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న ఏపీ అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వారిని తిప్పి పంపించారు. మరోవైపు ఏపీ అధికారుల నుంచి వినతి పత్రం తీసుకునేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక సాగర్ డ్యామ్ వద్ద ఏపీ ప్రభుత్వం సైతం పోలీసులను భారీగా మోహరించింది. ప్రాజెక్ట్‌కు ఇరువైపుల ఏపీ, తెలంగాణ పోలీసుల మోహరింపుతో సాగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పరిస్తితులను చక్కబడాలంటే కేంద్రం జోక్యం తప్పనిసరి అని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది.