జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష
🔹పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై చర్చ
🔹పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పెండింగ్‌లో రూ. 1600 కోట్ల బిల్లులు
🔹నేరడి బ్యారేజీ, వెలిగొండ ప్రాజెక్ట్‌పై సమీక్ష
🔹జూలై 31 నాటికి నెల్లూరు బ్యారేజీ నిర్మాణం
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖరాశామని..వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న సీఎస్ ఆదిత్యనాథ్.. త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని సీఎస్ తెలిపారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయని.. జులై 31 నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామని.. ఇంకా 180 మీటర్ల పని ఉందని..వచ్చే 3 నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని అధికారులు సీఎంకు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ –1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు.. టన్నెల్ –1 హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా దాదాపుగా పూర్తియ్యాయన్నారు. టన్నెల్ –2 పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పనులు ఆలస్యంకాకుండా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సీఎం.. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని తెలిపారు. వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 పనులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వీటిని ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని.. పనులు ఆలస్యంకావడానికి వీల్లేదన్నారు. పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు సత్వరమే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.బ్రహ్మసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మసాగర్ సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నిల్వచేయడానికి.. అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలానే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు.. గోదావరి కృష్ణా సలైనటీ మిటిగేషన్, వాటర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు.. పల్నాడు ప్రాంత కరువు నివారణా ప్రాజెక్టులు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.