జల జగడంపై కేంద్రం జోక్యం
🔹త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
🔹ఢిల్లీకి కేసీఆర్, జగన్.?
అమరావతి (ప్రశ్న న్యూస్) ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ ప్రాజెక్టులపై సాగుతున్న జల జగడం రోజురోజుకూ ముదురుతోంది. ఇవాళ తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ తెలంగాణపై ఫిర్యాదు కూడా చేసింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లోని మంత్రులు, రాజకీయ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం జోక్యం అంశం కూడా తెరపైకి వస్తోంది. దీంతో త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ అభ్యంతరాలతో మొదలైన ఈ వ్యవహారం మలుపులు తిరుగుతూ ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసే వరకూ వెళ్లింది. దీంతో ఏపీ సర్కార్ కూడా తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అయినా తెలంగాణ వెనక్కి తగ్గకపోవడంతో కేంద్రం జోక్యం కోరుతోంది. అంతే కాదు ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కూడా జగన్ సర్కార్ కోరుతోంది. దీంతో కేంద్రం జోక్యం చేసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.
ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ పై రెండు రాష్టాల ముఖ్యమంత్రులు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా ఇన్నాళ్లూ మౌనం వహిస్తున్న కేంద్రం.. తాజాగా దీనిపై ఏదో ఒకటి తేల్చేందుకు సిద్దమవుతోంది. ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పటికిప్పుడు రాజీ కుదర్చకపోతే ఈ వివాదం మరింత ముదిరి శాంతిభద్రతల సమస్యగా మారుతుందన్న నివేదికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. దీంతో త్వరలో చర్యలు తీసుకునేందుకు కేంద్ర జల్ శక్తి శాఖతో పాటు ఇతర విభాగాలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాలపై గతంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయి ఓ ఒప్పందం కుదిర్చింది. అయితే దీనికి విరుద్దంగా పొరుగు రాష్ట్రాలు వెళ్తున్నట్లు ఏపీ,తెలంగాణ పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో మరోసారి అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసి జల జగడంపై ఇరు ప్రభుత్వాల మధ్య రాజీ కుదర్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు జల్ శక్తి శాఖకు పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జల్ శక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ ప్రారంభమైన తర్వాత కృష్ణాబోర్డు సమావేశం నిర్వహించాలని భావించినా అది సాధ్యం కాలేదు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో కృష్ణాబోర్డు సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు హైదరాబాద్ లో అపెక్స్ కౌన్సిల్ భేటీ పెట్టినా దానికి హాజరయ్యేందుకు సీఎం జగన్ సిద్ధపడకపోవచ్చని సమాచారం. దీంతో కేంద్రం ఢిల్లీలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. త్వరలో దీనిపై ఇరు ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపే అవకాశముంది.